పుట:Naajeevitayatrat021599mbp.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు తయారు చేసిన పదకాలు చాలా అసంతృప్తికరంగా ఉన్నా, వాటిని 1921 లో ప్రవేశపెట్ట నారంభించారు. అదే రోజులలో సహకార నిరాకరణ, శాసన ధిక్కారాది ఉద్యమాలు ఆరంభించబడ్డాయి.

1921 కి పూర్వం, జనరల్ డయ్యర్ కారణంగా జలియన్ వాలాబాగ్ దురంతంలో వేలాది జనం క్రూరంగా హింసింప బడ్డారు. కాని ఆ ఉదంతం ఆంగ్లేయుల దృష్టిలో న్యాయ సమ్మతమే అయింది. అ దుష్కృత్యాన్ని "సాహసోపేతంగా" చేశాడని గౌరవ సూచకంగా ఆంగ్లేయులు జనరల్ డయ్యర్‌కు ఖడ్గ ప్రదానం కూడా చేశారు. దేశంలో ఎంత తీవ్రమైన అసమ్మతి ప్రకటించబడ్డా "రౌలట్" చట్టం ప్యాసయింది. ఆ చట్టం అంతం అయ్యేదాకా ధిక్కారాలూ, సవాళ్ళూ జరుగుతూనే వచ్చాయి.

1918-20 సంవత్సరాలలో కాంగ్రెసు నాయకత్వం క్రమేణా గాంధీగారి హస్తగతం అయింది. కాంగ్రెసు, భాషను ప్రాతిపదికగా తీసుకుని, 21 భాషా రాష్ట్రాలుగా దేశాన్ని విభాగించింది. కాంగ్రెసు కమిటీవారు అతి సులభమైన, అతి విస్తీర్ణమైన పదకంతో, నాలుగు అణాల చందాతో తమ సభ్యుల సంఖ్యను వృద్ధి పొందించు కున్నారు. నిర్మాణ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు జరిగింది. పన్నెండు మాసాలలోనే ఉద్ద్రుతంగానూ, నిర్దుష్టంగానూ అమలు జరిగిపోయింది. ఆ నిర్మాణ కార్యక్రమం, సహకార నిరాకరణ ఉద్యమం హిందూ మహమ్మదీయ సంఘీభావంమీద ఆధారపడి అభివృద్ధి గాంచాయి.

స్వాతంత్ర్యం కోసం నోరు తెరుచుకుని కూచున్న జన బాహుళ్యాన్ని సక్రమ మార్గాన్ని నడపించడం కోసం, నిర్మాణ కార్యక్రమం సవ్యంగా అమలు పరచడం కోసం ఒక కోటి రూపాయలు నిమిషాల మీద వసూలయ్యాయి. "ఒక్క సంవత్సరంపాటు శ్రమపడితే దేశంలో స్వాతంత్ర్యం స్థాపించ గలుగుతాం. స్వాతంత్ర్యం ఒక్క ఏడాదిలోపల్నే వచ్చేస్తుంది" అని అందరం నమ్మాం. ఈ ఆశతోనే, ఎన్నో కుల మతాలకు చెందిన జనం అంతా, కాంగ్రెసు పిలుపును మన్నించి,