పుట:Naajeevitayatrat021599mbp.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాము అమలు జరుపుతున్నామని, ఇందులో అసాధారణ పద్ధతులేవి లేవనీ చెప్పారు. ఓటింగు జరిగే ముందు, మెంబర్లు లోపలికి వెళ్ళే ముఖద్వారం దగ్గిర వేచి ఉండి, ప్రభుత్వ సభ్యులు ఇతర సభ్యులను తమ పక్షానికి రావలసిందని ఎంతో ఒత్తిడి చేశారు. కొంతమంది ఒంటిమీద చేతులు వేసికూడా తమ బూత్‌లోకి దారి జూపారు. రాజకీయ సమాచారాధికారి (Public Information Director) గా మెంబర్లకు సలహా చెప్పి దారి చూపించవలసిన ఆసామీ (wihp గా) తనకున్న హోదాను దుర్వినియోగం చేస్తున్న సందర్భాల నన్నింటినీ, సభాధ్యక్షుని దృష్టికి నేను తీసుకు రావలసి వచ్చింది.

తటస్థుల దగా

ఈ విధంగా ప్రభుత్వంవారి కాన్వాసింగ్ తీవ్రరూపం దాల్చడంతో, మా గ్రూపునుంచి ఒకరిద్దరు మెంబర్లు జారిపోతారేమోననే భయం వేసింది. మేము భయపడినంతా జరిగింది. చివరికి గవర్నమెంటువారికి 68 ఓట్లూ, మాకు 65 ఓట్లూ వచ్చాయి. తటస్థంగా ఉంటామన్న వారు గవర్నమెంటువారి ఒత్తిడికి లోనయి, మమ్మల్ని దగా జేశారు. అది ఒక తీవ్రాతి తీవ్రమయిన పోటాపోటీ. మా కింకొక రెండు ఓట్లు వచ్చి ఉన్నా, వైస్రాయ్‌రు తన ఓట్లు వేసి గెలిపించేవారు.

అంత బలవత్తరమయిన ప్రభుత్వంకూడా, ఏ విధంగానైనా ఒక్క ఓటు మెజారిటీతోనైనా, నెగ్గాం అనిపించుకుని, ముఖం ఎత్తుకుని తిరగడానికి ఎంత తాపత్రయ పడిందో! గవర్నమెంట్ నామ మాత్రంగా తన పరువు నిలబెట్టుకో గలిగిందంతే. దేశంలో అందరికీ గవర్నమెంటు పద్ధతులూ, విధానాలూ బాగా అవగతమయాయి. ప్రభుత్వ విధానాలు ప్రజాహృదయాన్ని గాయపరచాయి. ప్రభుత్వం రాజకీయంగా గెలిచినా, నైతికంగా దెబ్బతిందన్నమాట!