పుట:Naajeevitayatrat021599mbp.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెండి రూపాయల క్రిందకు మార్చుకోవడంతో సరిపోయేది. పగోడా విలువ 2.5 రూపాయలు ఉండేది.

ఉభయపక్షాల వాదనలూ తీవ్రరూపం దాల్చి, తారస్థాయినందు కున్నాయి. సర్ బేసిల్ వాదనలన్నీ వాగ్దాటి ప్రదర్శనలేగాని సరుకున్నవి కాదని తేలిపోయింది. ఎప్పటి కప్పుడు ఆయన వాదనలలోని లోట్లు ఎత్తి చూపించి, "వాటిలో బలం లేదు, అవి నిలువవు" అని నిరూపించేశాం. ప్రజాభిప్రాయం అంతా కాంగ్రెసుపార్టీ వైపూ, ఆ పార్టీతో చేతులు కలిపిన వారివైపూ మొగ్గిపోయింది. వాదనల మధ్య సర్ బేసిల్ రాజీ సూచనలు చెయ్యడం మంచిదనుకున్నారు. రెండు ఉత్తరాలు వ్రాశాడు: ఒకటి నాకు, రెండవది మొదటినుంచీ వాదన బాగా నడిపిస్తూన్న ఇంకొక మిత్రునికీను. ఆయన రాజీ ప్రతిపాడనలు మాకు నచ్చని కారణంగా చర్చలు సాగాయి.

ఓట్లకోసం డాన్స్ పార్టీలు

ప్రతిపాదనలు ఓటుకు పెట్టాలి కదా! తమ పక్షాన ఓట్లు కోసమని ప్రభుత్వం ఎన్నో ఎత్తులూ, జిత్తులూ ఉపయోగించవలసివచ్చింది. మా పక్షాన ఓటు వేస్తారనుకునే వారిలో గుండె దిటవులేనివారు ఉండ వచ్చు కదా! ప్రభుత్వంవారు అటువంటి వారినల్లా ఆశ్రయించారు. గవర్నమెంటు పార్టీవారు మా పార్టీ బలాన్ని తగ్గించడానికి ఓటింగు ముందు రాత్రిళ్ళు డిన్నర్లు, విందులూ ఏర్పాటు చేశారు. పాట కచేరీలు, డాన్స్ పార్టీలూ, బోగం మేళాలూ కూడా ఏర్పాటు చేశారు. చదువరులకు హుషార్! ఆశ్చర్యపోకుండా సంగతులు గ్రహించమని వారికి నా మనవి.

ఆంగ్లేయులలో వృద్ధులు, తామవలంబిస్తూన్న విధానాలన్నీ శాస్త్ర సమ్మతమేననీ, అటువంటి క్లిష్ట పరిస్థితులలో, వారి దేశంలో ఇరు పక్షాలవారూ ఓట్ల సంపాదనకు అవలంబించే సామాన్య పద్ధతులనే