పుట:Naajeevitayatrat021599mbp.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశానికి, వారి సరుక్కీ "చవక బజారు"గా, వారి సరుకు అమ్మకానికి మన దేశం అమరాలి. ముఖ్యంగా, మనం సహకార నిరాకరణం కారణంగానూ, స్వదేశాభిమానంతోనూ పై దేశాలనుంచి దిగుమతులు తగ్గించేస్తూ ఉంటే, పై రీతిని ధరల తగ్గింపు బేరంతో మన నెత్తిన ఎక్కువ సరుకు రుద్దడానికి వారు తంటాలు పడుతున్నారన్నమాట. మారకపు రేటు విలువ హెచ్చింపుతో అల్లా వారు "బజార్ని" చేబడుతూ ఉంటే, మన గ్రామీణ పరిశ్రమలూ, మన ఖాదీ ఉత్పత్తీ, దాని అమ్మకమూ దెబ్బమీద దెబ్బ తింటాయన్నమాట.

తీవ్ర వాదోపవాదాలు

ఇన్ని విధాలుగా మనం నష్టపోతూ ఉంటే, రూపాయలలో జీతాలు పుచ్చుకునే ఆంగ్లేయులూ, రూపాయలలోనే లాభాలార్జిస్తూన్న ఆంగ్లేయ వర్తకులూ మునుపటివలె ఖర్చుపెట్టకుండా రూ 13-5-4 లకు రూ 15 ల విలువగల పౌనును కొని, వారి వరుమానంతో మునుపటి కంటె ఎక్కువ పౌనులు కొనకలిగి, వారి బ్యాంకి నిలువలు పౌన్లలో అభివృద్ధి చేసుకోజొచ్చారు. అంతే కదా అంటూ ఈ వాదన అంతా కేంద్ర శాసన సభా వేదికపై చేసేసరికి, అది ఒక చరిత్రాత్మక వాదన అయింది. మా మిత్రులు అన్ని వైపులనుంచీ తర్జనభర్జన చేసి చూపించారు. సర్ పురుషోత్తమ దాస్, ఘన శ్యాందాస్ బిర్లా, జమ్నదాస్ మెహతా మొదలైన వారంతా ఈ విషయాన్ని గురించి క్షుణ్ణంగా చదివారు. నేనూ, నా పరిశోధనను క్షుణ్ణంగా సాగించాను. 1908 నుంచీ వీలు చిక్కినప్పుడల్లా, స్వాభావికంగా ఉంటూ ఉన్న రేటును పెంచుతూ, ఆంగ్ల దేశవాసులు అక్రమ లాభాలు సంపాదించాలన్నప్పుడల్లా, వారు అవలంబిస్తూ వచ్చిన పద్ధతులన్నింటినీ ఎత్తి చూపించగలిగాను.

ఆ తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన దినాలలో వారి అక్కౌంటు పద్దతి అంతా బంగారు నక్షత్రం మార్కు పగోడాలన్నీ