పుట:Naajeevitayatrat021599mbp.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పోయాము. వాళ్ళు మమ్మల్ని పట్టుకుని పోలీసులికి అప్పజెప్పే లోపల మా పెద్దవాళ్ళు నలుగురూ వచ్చి వాళ్ళ పంట వాళ్ళ కిప్పించారు. ఇంతకీ చేను కోతకి సిద్ధంగా ఉంది కదా! ఆ రయితుకి ఖర్చు లేకుండా కోత అయిందని పెద్దమనుష్యులంతా తగాదా తీర్చారు. ఆ దొంగతనం వల్ల కలిగిన న్యూనత మూలంగా మేము ఎవళ్ళం కూడా రెండు రోజుల దాకా ఇళ్ళకి వెళ్ళలేదు. ఆ రోజుల్లో ముఠాకి 'ఊట్' కంపెనీ అనే పేరు వచ్చింది. నాకు అప్పటికే నవులూరి రమణయ్య అనే ఒక పోకిరీ సహవాసం లభ్యమైంది. వాడి పెత్తండ్రి పురుషోత్తం అనే అతను బాగా వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాడు. అతని తమ్ముడి కొడుకే ఈ రమణయ్య. ఇతను తన జబరదస్తీ వల్ల 'కింగ్ ఆఫ్ ఒంగోలు' అనే బిరుదు సంపాదించాడు. వాడు కూడా ఆ పొలం దోపిడీలో ఉన్నాడు.

3

నాటకరంగ ప్రవేశం

ఈ కాలంలోనే నా జీవితాని కంతకీ మార్పు తెచ్చిన నాటకాల ప్రకరణం ప్రారంభం అయింది. నాకు లోవర్ ఫోర్తు చదువు పూర్తి అయ్యేసరికి పూనా కంపెనీ ఒంగోలు వచ్చింది. వాళ్ళు హిందీలో నాటకాలు ప్రదర్శించేవారు. అప్పుడు వాళ్ళు ప్రమీలా స్వయంవరం, పీష్వా నారాయణరావు వధ, ఉషా పరిణయం, కీచక వధ మొదలైన నాటకాలు ఆడారు. మేమంతా నాటకాలు చూచాము. మాకు అప్పట్లో అల్లాంటి నాటకాలు ఆడాలనే సంకల్పం కలిగింది. మా సంకల్పానికి తోడు ఆ ఊళ్ళో నాటకాలంటే చెవి కోసుకునే ఉండదల్లీ సాహేబు అనే ఆయన ఉండేవాడు. నాకు పితృసమానులు, నా జీవితాభివృధ్ధి కంతకీ మూలకందమూ అయిన ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు కూడా అక్కడ మిషన్ స్కూల్లో ఉపాధ్యాయు