పుట:Naajeevitayatrat021599mbp.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించాడు. మారకపు విలువలు పెంచాలి అన్న కరెన్సీ కమిటీ సిఫార్సు సవ్యమయినవేనని రుజువు చెయ్యగల స్థిలో ఆయన ఉన్నట్లు తోచలేదు. అలాంటప్పుడు ఆ బిల్లు ప్రవేశ పెట్టకుండా ఉండవలసింది. కాని ప్రతిఘటన వస్తుందని తలచలేదుగా! కాగా, వారికి కావలసినదల్లా డబ్బు! దానిని న్యాయంగా సంపాదిస్తున్నట్లు కనబడేటట్లు చేయడమేగా ప్రధానం! కాస్సేపు మెంబర్ల నిద్రపోవడమో, బైటకు వెళ్ళడమో, పట్టించుకోకుండా కూచోవడమో జరగాలి. అంతే. అది చట్టం అయి ఊరుకుంటుంది. దాన్తో అంతా న్యాయం అవుతుంది అన్నదే ఆయన తలంపు, దానికోసమే ఆ తాపత్రయం. కాని కథ కాస్త అడ్డం తిరిగింది. అంతే!

అప్పటికి అమలునందున్న మారకపు రేటు, ఏవయినా కొన్ని కారణాలచేత, కొంతకాలం పాటు 1షి. 4 పె.లకు-1షి. 6 పె. లకు మధ్య ఊగీసలాడి ఉంటే, వారు చేయదలచిన పని ఛాయామాత్రంగానైనా సవ్యం అయి ఉండేది. నిజానికి ఎంత కాలంగానో ఆ మారకపు విలువ 1 షి. 4 పె. ల దగ్గర అలాగే నిలిచిపోయింది. ఆ స్వతస్సిద్ధపు విలువ మారడానికీ, రేష్యో పెరగడానికి మార్గాలేవీ కనబడని కారణంగా, ఆర్థిక సభ్యునికి స్వాభావికంగానో , అస్వాభావికంగానో-ఏదో ఒక పద్ధతిని విలువ పెంచాలని బుద్ది పుట్టింది. నేను సర్ బేసిల్ని అడిగాను: "తమరు గత 12 మాసాలలోనూ అస్వాభావికంగా ఆ విలువని 1షి. 6పె. ల దగ్గర ఉంచడానికి నిజంగా ఎంత ఖర్చు పెట్టారని?" "ముప్పయికోట్ల రూపాయలు మాత్రమే"నని చెప్పాడు. అస్వాభావికంగా పండ్రెండు మాసాలపాటు ఆ విలువను అలా ఉంచడానికి ముప్పయికోట్ల ఖర్చయి ఉంటే, ఇంతకాలంగా ఆ విలువను అల్లా నిలబెట్టడానికి ఎన్నికోట్లయిందో గదా!....తిరిగి నేను, ఆ మారకపు రేటు మార్పువల్ల దెబ్బతినే మన ఆస్తులన్నింటి మీదా, ఆ మార్పు అమలు జరిగిననాడు వచ్చే నష్టం ఏ మాత్రం ఉంటుందని అడిగినప్పుడు, సుమారు 48 కోట్ల రూపాయ లుండవచ్చునని సమాదానం ఇచ్చాడు.