పుట:Naajeevitayatrat021599mbp.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమించుకోవడానికైనా, ద్వేషించుకోవడానికైనా వీలుగా ఉండేది. ఇల్లాంటి అవకాశాలూ, సందర్భాలూ ఆ 1926-1930 సంవత్సరాల మధ్య వస్తూ ఉండేవి గనుక, పై విషయాలు ఆ నాలుగైదు సంవత్సరాలకు సంబంధించినవే అనుకోవచ్చును.

20

మారకపురేటు పెంచరాదని

హోరాహోరీ పోరాటం

1927 నాటి శాసన సభా కార్యకలాపాలవైపు మళ్ళీ ఒకసారి దృష్టి సారిద్దాం. ఆ రోజులలో మాకు కరెన్సీమీదా, రూపాయి మారకపు విలువలమీదా, రిజర్వుబ్యాంకి బిల్లుమీదా ప్రభుత్వంవారు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలమీద తర్జన భర్జన చెయ్యడం తప్పనిసరి అయింది. తర్జనభర్జన తప్పనిసరి అయిందనడంకంటె, మంచి హుషారుగా సాగిందనడమే న్యాయమేమో.

రూపాయి మారకపు విలువలను గురించీ, ఎక్సేంజిని గురించీ, ఇండియా ప్రభుత్వంవారిచ్చే ఆదేశాలను ఆ నాటి శాసన సభవారుగాని, రాజకీయ నాయకులుగాని అంతగా పట్టించుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఆ విషయాలను కఠినమయిన చిక్కు సమస్యలుగా, కొరకరాని కొయ్యలుగా ఎంచి విస్మరించేవారు. ఎంతో అనుభవమూ, లోకజ్ఞానమూ ఉన్నవారికేగాని అర్థంగాని సమస్యలవి. ఆ జటిలమైన ఆర్థిక విషయాలను గురించి ఎంత చదివినా, ఇంకా ఎంతో ఉంటుంది తెలుసుకోవలసింది. లేకుంటే తబ్బిబ్బే. ఆ సమస్యలు సరిగా అర్థంచేసుకుని వాటిమీద తర్జనభర్జనలు వస్తే నిలిచి మాట్లాడగలిగేవారు ఆ రోజుల్లో చాలా కొద్దిమందే ఉండేవారు. అ అల్ప సంఖ్యాకులలో ఘనులు, ప్రముఖులు అనదగినవారు సర్ పురుషోత్తమదాస్ ఠాకూర్‌దాస్‌గారు. వారి తర్వాత అనండి, వారికి ముందే అనండి-జమ్నదాస్ మెహతా