పుట:Naajeevitayatrat021599mbp.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిక్షణతోనూ, పకడ్ బందీగానూ ఏర్పడిందనీ, భారత దేశంలో ఇంత బ్రహ్మాండమయిన పార్టీ ఇంకొకటేదీ లేదనీ గ్రహించారు.

అవబోధంతక్కువైన ప్రజ

శాసన సభతో సంబంధం ఉన్న రాజకీయ కాంగ్రెసు నాయకులంతా నిర్మాణ కార్యక్రమంపట్ల చిన్నచూపు చూసి ఉండకపోతే, దేశమూ, దేశంలోనీ గ్రామాలు ఆ 1926-30 మధ్య కాలంలో, పరిస్థితులను సరిగా గ్రహించి, సక్రమమయిన మార్గంలో పొందికగా ముందడుగు వేయగలిగి ఉండేవి. నాయకత్వం నో ఛేంజర్ల చేతిలో ఉన్నా, కౌన్సిల్‌వారి చేతిలో ఉన్నా, ప్రజలకు రాజకీయ విజ్ఞానం కలిగించ గలిగి ఉన్ననాడు, ప్రజలు తమ చేతులలోనే పూర్ణమైన హక్కులున్నాయనీ, కౌన్సిల్స్‌వారూ, మంత్రులూ వారి క్షేమాన్ని కాంక్షించే పరిపాలన నిర్వహించవలసి ఉన్నదనీ, వైస్రాయిగారితో సహా యావత్తు పరిపాలనా యంత్రాంగమూ వారి చెప్పు చేతులలోనే నడవవలసి ఉంటుందనీ గ్రహింప గలిగేవారు.

కాని ఓటర్ల దురదృష్టం కొద్దీ, కాంగ్రెసులోని ఇరుపక్షాలవారూ, ఎవరికి తోచిన విధంగా వారు ఏ దూర తీరాలకో కొట్టుకునిపోతూ వచ్చారు. 1924 లో బెల్గాం కాంగ్రెసులో స్వరాజ్య పార్టీవారి చేతులలోకి కాంగ్రెసు వచ్చింది లగాయితు, ఏటేటా దిగజారడమే కనబడింది. ఎటొచ్చీ 1926, 1930 సంవత్సరాల మధ్యకాలంలోనూ, దరిమిలానూ కూడా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్లకు ఏమేమో నూరిపోసేవారు. ఆ చెప్పిందైనా ఓట్లు ఎల్లా వెయ్యాలి అన్న విషయం మీదే కేంద్రీ కృతమై ఉండేది. కాని నిజానికి అది ఒక జాతి నిర్మాణానికి చాలని ప్రబోధం. సహకార నిరాకరణ ఉధ్యమం ఎప్పుడు ఆరంభమయినా అరెస్ట్‌లూ, జైళ్ళూ తప్పవు గనుక, అక్కడే ఆజైళ్ళలోనే ఆ రెండు పార్టీలవారికీ ఒకరి నొకరు