పుట:Naajeevitayatrat021599mbp.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అపజయం కలిగినా, మేము ఆ కేంద్ర శాసన సభలో మొత్తం నలభై యిద్దరం ఉన్నాము. కేంద్రప్రభుత్వం ఛాయామాత్రంగానైనా మంత్రులను ఏర్పరచడం వగైరా కార్యకలాపాలలోకి దిగకుండా విధినిర్వహణను విస్మరించింది. దేశ సౌభాగ్యానికి భిన్నమయిన ప్రతిపాదనలు ఏవి వచ్చినా వాటిని చిత్తు చెయ్యాలన్నదే మా ఆశయం.

కపటపు పార్లమెంటు

మాదొక కపటపు పార్లమెంట్ కదా! ముందుముందు నిజంగా రాజ్యాంగం చేపట్టవలసిన పరిస్థితులలో నడచుకోవలసిన తీరులకు ఈ రోజులలో నడుస్తున్న పార్లమెంటు విధానం కొంత అనుభవాన్ని సమకూర్చింది. సభ్యులూ, నాయకులూ కూడా వాదోపవాదాల లోనూ, పార్లమెంటరీ విధానంలోనూ నేర్పరులయిన కలహప్రియులుగా రూపొందారు. ఆంగ్లదేశపు ప్రైంమినిష్టర్ల కంటే మోతిలాల్‌నెహ్రూ గారు చాకచక్యంగా వ్యవహరింపగల నేర్పరులని పేరుబడ్డారు. ఆంగ్లదేశపు పార్లమెంటు మెంబర్లకంటె మన సభ్యులకు సమస్త సమాచారములూ అందజేయబడడాన్ని మనవారి హోదా ఎంతో మెరుగ్గా ఉండేది. ఏ విషయయినా క్షుణ్ణంగా తర్జన భర్జన చేయగలశక్తి మనవారికుంది.

మనవారి తెలివితేటలూ వగైరా ఎంత అఖండంగా ఉన్నా ప్రజల బాధ్యత ప్రభుత్వం వారిది కానప్పుడు లాభమేమిటి? కేంద్రంలో ఉన్న కాంగ్రెసువారు ఇదివరకంటె ఎంతో ఎక్కువగా ప్రభుత్వంవారి "నటనలను" బైటపెట్టగలిగారు. వాదోపవాదాలు చాలా పటుత్వంతోనూ, ప్రజాహృదయాన్ని చూరాగొనేవిగానూ, రాజ్య తంత్రాన్ని నడపగలిగేవిగానూ ఉండేవి. కేంద్ర శాసన సభలోని కాంగ్రెసు పార్టీవారు ప్రభుత్వంవారి "నటనా" విధానాన్ని వెనకటికంటె ఎంతో శక్తియుక్తులతో బైటపెట్టగలిగారు. వాదోపవాదాలు చాలా ఉన్నతస్థాయిలో నడిచేవి. ఎల్లప్పుడూ గవర్నమెంటు విధానాన్ని కించపరిచేవిగానే ఉండేవి. ప్రభుత్వం వారికి ఎప్పుడో ఒకప్పుడు పరిపాలన ప్రజల హస్తగతం చెయ్యకతప్పదని అర్థమయింది.