పుట:Naajeevitayatrat021599mbp.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అక్కడనించే మిడిల్ స్కూలు పరీక్షకి హాజరై మొదటి తరగతిలో ఉత్తీర్ణుణ్ణయ్యాను.

అప్పటి హెడ్మాస్టరు సుందరశివయ్య అనే ఆయన, కొంచెం చదివితే పనికొచ్చే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా చదువు చెప్పేవాడు. అల్లాంటి వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. అక్కడ కూడా ప్రవర్తన విషయంలో మనకి మామూలు యోగ్యతా పత్రికే సంప్రాప్తమైంది! పోకిరీ పిల్లల సహవాసం, జబర్ దస్తీ, మాష్టర్లని ధిక్కరించడం మొదలైన గుణాలు మన్ని వదలనే లేదు. బొంగరాలు, గోలీలు, మొదలైన ఆటల్లో మనది అందివేసిన చెయ్యి. సామాన్యంగా చెడుగుడు ఆటకి పెండేసి బద్దని నేనే! క్రికెట్టు ఆటలో రెండు జట్లుండేవి. ఒక జట్టులో నా పేరు ప్రధానంగా ఉండేది. ఇంతకీ ఈ ఆటలకి డబ్బు కావాలి గదా! ఆ డబ్బు మన దగ్గిర లేదు. అందుచేత అల్లాంటి వాళ్ళం అంతా కలిసి, చిన్న ముఠాగా చేరి, బజారులో వస్తువులమ్మే వాళ్ళ కళ్ళలో కారం కొట్టి డబ్బు సంపాదించే వాళ్ళము. నిరంతరం ఈ డబ్బు కోసం తడుముకోవడమే ఒక ఆలోచనగా ఉండేది.

ఒక రోజున మా ముఠా అంతా చేరి, "ఈ డబ్బు సంపాదించడం ఎల్లాగా?" అనే ఆలోచనలో పడ్డాము. మా ముఠాలో అద్దేపల్లి అప్పడు అనే అతను మంచి గట్టివాడు. ముఠా కంతటికీ ఏకైక నాయకుడు! మేమంతా కలిసి అతని నాయకత్వం కింద డబ్బు సంపాదించడానికి ఒక పన్నాగం పన్నాము. ఒంగోలికి చేరి వున్న రంగారాయుడు చెరువు కింది పొలంలో వరిగె పండి కోతకి సిద్ధంగా ఉంది. మేము రాత్రి రాత్రి ఆ పంట కోసి, అమ్మి, డబ్బు సంపాదించడానికి నిశ్చయించి, రాత్రి 12 గంటలకి కోత ముగించి, కట్టలు కట్టి నెత్తిన పెట్టుకున్నాము. ఇంతలో ఆ కాపలా వాడికి మెళకువ రావడమూ, వాడు కేకలు పెట్టగా నలుగురూ లేచి మమ్మల్ని పట్టుకోవడమూ జరిగాయి.

అప్పట్లో మా జట్టు నలుగురు. ఆ నలుగురిలో నేనే చిన్నవాణ్ణి. మాలో మస్తాన్ అని ఒక సాహేబుల కుర్రవాడు ఉన్నాడు. మేము కొంతసేపు ధైర్యసాహసాలతో ప్రతిఘటించాము. కాని, చివరికి దొరికి