పుట:Naajeevitayatrat021599mbp.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రించడంచేత వారు తమ ప్రయత్నంనుంచి విరమించుకుంటారనే నేను భావించాను.

డా. సుబ్బరాయన్ "స్వతంత్రపార్టీ"

డాక్టర్ సుబ్బరాయన్‌కు "స్వతంత్రపార్టీ" అనే సొంతపార్టీ యేదీ లేదు. ఆయన వెనకాల ఉన్న అ నలుగురూ, అధికారంలో ఎవరు ఉంటే వారి పార్టీవారిగానే చెలామణీ అవుతూ, వారి వెనుకనే చేతులు నలుపుకుంటూ తిరిగేరకం. కాని రాజగోపాలాచారిగారూ, శ్రీనివాసయ్యంగారూ కూడా కాంగ్రెసుపార్టీ యావత్తు సహకారమూ ఉంటుం దని హామీ ఇచ్చారు. ఆ మద్దతు చూసుకుని, ఈ వార్త ఆయన మెల్లిగా గవర్నర్ గారి చెవినివేసి, తనకు కాంగ్రెసు వారి సహకారం ఉంటుందనీ, తన సహచరులను తాను ఎంచుకుంటాననీ విశదపరచాడు. "స్వతంత్రపార్టీ మంత్రివర్గం" అన్న పేరుమీద ఆయన, మంత్రులను ఎంచుకుని, రాజ్యాంగాన్ని చేపట్టారు.

ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెసు కమిటీవారూ, మలబారువారూ, ఈ ఏర్పాట్లకు మొదటినుంచీ వ్యతిరేకులే. బ్రిటిషు గవర్న్‌మెంట్ వారి దృష్టిలోనూ, వారి ప్రత్యర్థుల దృష్టిలోనూ, దేశీయులలోను కూడా కాంగ్రెసు ఎంత చులకనై పోతుందోనన్న విచారంగాని, ఆలోచనగాని ఆ అరవనాయకుల కిరువురుకూ లేక పోయింది. సూక్ష్మబుద్ధి, దూరదృష్టి గలవారని పేరున్న ఆ నాయకులు ప్రజలదృష్టిలో కాంగ్రెసు ఎంత హీనమై పోతుందో తెలుసుకోలేక పోయారనలేము. పర్యవసానాల ప్రసక్తే వారికి పట్టలేదని మాత్రం అనవలసివస్తుంది. వారి హృదయాంతరాళాలలో పదవీవ్యామోహం బాగా నాటుకుపోయిన కారణంగా గత్యంతరంలేక వారు పైనాటకం అంతా ఆడవలసి వచ్చింది.

కాంగ్రెసు బురఖారాయళ్ళు

రాజగోపాలాచారి ప్రభృతులు ఆడిన ఈ నాటకంవల్ల వారికి గాంధీగారియందుగాని, వారి కార్యక్రమమందుగాని, వారి సహకార