పుట:Naajeevitayatrat021599mbp.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే కాంగ్రెసువారు పదవులు స్వీకరింపరన్నది బాహాటంగా అందరూ ఎరిగిన విషయమే. కాంగ్రెసు మెజారిటీ వచ్చిన అన్ని రాష్ట్రాలలోనూ (మద్రాసుతో సహా) సహకార నిరాకరణమే వారి ఆశయం అయినా మంత్రిపదవులను స్వీకరిస్తే ప్రజలకు ఉపకరించే సందర్భాలలో సహకరిస్తూ, గోడమీద పిల్లి వాటంగా సహకారమో, సహకార నిరాకరణమో సందర్భానుసారంగా అవలంబిస్తూ ఆ నాలుగు రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీల ఆజ్ఞలు పాటించవలసి ఉంది.

మామూలు పరిస్థితులలో దక్షిణ హిందూదేశానికి సంబందించినంతవరకూ, ఆ నాలుగు రాష్ట్రాలవారికీ, కాంగ్రెసు మెజారిటీ వచ్చిన ఇతర రాష్ట్రాల వారితోపాటు పదవీ స్వీకార విషయంలో చికాకులూ, చిక్కులూ లేనేలేవు. అస్సాం (గౌహతీ) కాంగ్రెసు "మంత్రి పదవులు స్వీకరింపరాదు" అని ఆదేశం ఇచ్చే ఉంది. కాంగ్రెసుపార్టీ లీడరును పిలిచి, మంత్రులను ఎన్నుకుని, రాజ్యాంగాన్ని చేపట్టమని గవర్నరు ఆహ్వానిస్తాడన్న సంగతి అందరూ ఎరిగి ఉన్నదే. విశాఖపట్నవాసి, కీర్తిశేషులైన సి.వి.ఎస్. నరసింహరాజుగారు ఆనాడు కాంగ్రెసు పార్టీ లీడరయిన కారణంగా, ఆయన్ని గవర్నరుగారు పిలిచి మంత్రులను ఎన్నుకుని, రాజ్యాంగాన్ని చేపట్టమని కోరినప్పుడు, తాను గవర్నరుగారి కోరికను మన్నించరాదని అప్పటికే ఆయనకు కాంగ్రెసు వారిచే హుకుం జారీ చేయబడింది.

తెరవెనుక నాయకులు

తమిళరాష్ట్ర నాయకులైన శ్రీనివాసయ్యంగారు, రాజగోపాలాచారిగారు పైకేమీ తేలలేదు. మంత్రిపదవులు స్వీకరించి, రాజ్యాంగాన్ని చేపట్టాలనే ఆశ తమకు లేదని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చెప్పవలసిన విధి వారిపై ఉంది. కాంగ్రెసుపార్టీ పేరుమీద మంత్రిపదవులను స్వీకరించడానికి వీలులేకపోయినా, తమ సొంతపేరుమీద కాని పక్షంలో, ఏదో ఒక పేరుమీద, ఏదో ఒకవిధంగా "బినామీ" మంత్రిపదవులనైనా స్వీకరించి తమ వాంఛలను తీర్చుకోవాలనే కోరిక ఆ యిరువురి నాయకులకూ మిక్కుటంగా ఉంది.