అప్పుడు ఆ మాట నా కంతగా అర్థం కాలేదుచ కానీ, ఇంగ్లీషు చదువులు ఉన్న ఒంగోలులో హోటలు పెట్టి, అందువల్ల వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయం చేసినప్పుడే ఆమె మాటల అర్థం నాకు బోధపడింది. ఆ రోజుల్లో హోటలు వ్యాపారం అంటే ఈ రోజుల్లోలాగ గౌరవకరమైన వ్యాపారంగా పరిగణింపబడేది కాదు. ఇప్పుడు హోటలు యజమానులకి సంఘంలో కొంత గౌరవాదరాలు కలుగుతున్నాయి. ఆ రోజుల్లో హోటలు పెట్టుకున్న వాళ్ళంటే సంఘంలో ఎంతో చులకనగా చూసేవారు. అందరూ "పూటకూళ్ళ వాళ్ళు, పూటకూళ్ళ వాళ్ళు" అని చులకనగా మాట్లాడేవారు. కానీ, ఒకరి కుటుంబంమీద ఆధారపడి, వారికి బాధ కలిగించడం కన్న స్వోదరపోషణార్థం, నలుగురికింత అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించింది. ఎల్లాగైనా నాలుగు కాలాలపాటు శ్రమ పడి, తలకాచుకుని, ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. అదే మాతృప్రేమలో ఉండే అమృతం.
బంధువులు కొందరు నిరుత్సాహపరిచినా, మా అమ్మగారు ఆ నాడు సాహసం చేసి, సహాయానికి మా అమ్మమ్మగారిని వెంటబెట్టుకుని మా జానకిరామయ్య పుట్టిన 5,6 మాసాలకే ఒంగోలు చేరుకుంది. ఒంగోలులో అప్పటికే మునసబు కోర్టు ఉండింది. ఆ కోర్టుకి ఎదురుగా నెలకొక రూపాయో, అర్ధో అద్దె ఇచ్చి ఒక ఇంట్లో హోటలు ప్రారంభించింది. అప్పటికప్పుడే మా మేనమామ నన్ను ఒంగోలు తీసుకు వచ్చి గవర్నమెంటు నార్మల్ స్కూలులో లోవర్ ఫోర్తులో ప్రవేశపెట్టాడు. ఆ నాడు ట్రాన్సుఫర్ సర్టిఫికేట్లు మొదలైనవి ఏమీలేవు. ఒంగోలులో స్కూలు అధికారులు నన్ను పరీక్ష చేసి లోవర్ ఫోర్తుకి నేను అర్హుణ్ణని నిర్ణయించారు.
1884 సంవత్సరంలో ఈరీతిగా చదువుకోసం ఒంగోలు చేరుకున్నాము. ఆప్పటికి నా వయస్సు 12 సంవత్సరాలు. అప్పటికి గవర్నమెంటు మిడిల్ స్కూల్లో అప్పర్ ఫోర్తు దాకా చదివాను.