పుట:Naajeevitayatrat021599mbp.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనకు ప్రతికూలమైన పరాయి ప్రభుత్వం మన ఆశయాలను సర్వనాశనం చేస్తూఉంటే, మనవాళ్ళు శాసన సభా ప్రవేశం అనే నిరపాయకరమైన మార్గమును పట్టుకుని, నవ జీవన విధానంగా నూతన నిర్మాణం సాగించి తమ స్థాయిని నిలుపుకోవడానికయినా జనులను ప్రబోధించి, ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్య సంపాదనకు పాటుబడివుండవలసింది. ఇలా ఎత్తుపై యెత్తులు వేసుకుంటూ ప్రజలలో ప్రచారం, ప్రబోధం చేసిఉంటే, సంయుక్త రాష్ట్రాలలో పండిత మోతిలాల్ నెహ్రూగారు ఆ ఎన్నికలలో ఓడిపోయేవారేకాదు. ఈ సంగతి వారి కుటుంబీకులు నిర్మొగమాటంగా ఒప్పుకున్నారు.

గాంధీగారి అనుచరులుగా ఖాదీ ఉద్యమంలో తల దూర్చినవారు, తమకున్న చిక్కులతో కొట్టు మిట్టాడుతూ, తిరిగీ కాంగ్రెసు గాంధీగారి చేతులలోకి వస్తేనే బాగుండును-ఆ శుభముహూర్తం ఎప్పుడో కదా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రజలలో ఓటింగు విధానాన్ని గురించి కాని, తద్వారా కలుగగల కీడు మేళ్ళను గురించిగాని, పరిపాలనా విధానాలను గురించిగాని ప్రజలకు బోధించడంలో వారికి ఆసక్తే లేదు. నిర్మాణ కార్యక్రమవాదులు తదితరములైన రాజకీయాది కాంగ్రెసు విధానాలలో పాల్గొనడం తమకు అనవసరం అని తలచేవారన్నమాట! వారికి తెలిసినదల్లా ఒక్కటే-గాంధీగారి శక్తి సామర్థ్యాలు బహుళం అనీ, వారి సహకార నిరాకరణమూ, శాసన ధిక్కారము మొదలైన విధానాలన్నీ విజయవంతం అవుతాయనీ, ముందు ముందు ఎప్పుడో ఒకనాడు ప్రజలే రాజ్యాంగాన్ని చేపట్టి, పరిపాలనా యంత్రాన్ని నడిపించగలరనే దూరదృష్టి వారికి ఉన్నట్లు కనిపించలేదు.

పేలిన టపాకాయలు

ఈ రెండు రకాల కాంగ్రెసు కార్యక్రమాల మధ్య పడి నలిగి, నాయకులలో నెలకొన్న అలసతాభావం కారణంగా ప్రజలు చిక్కుల పాలయ్యారు. తమ నాయకులు ఎన్నికలలో నెగ్గారు నిజమే. కాని అవసరమైన రాజకీయ చైతన్యం వారు కలిగించక పోవడాన్ని ప్రజలకు