పుట:Naajeevitayatrat021599mbp.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిన తీర్మానాలని త్రోసివెయ్యడ మన్నది ఇదే మొదటిసారికాదు., అనేకసార్లు అట్టి త్రోసివేతలు జరిగాయి.

కాన్పూరు కాంగ్రెసు అనంతరం ఒక సంవత్సరం విశ్రాంతి తీసుకుంటానన్న గాంధీగారు గౌహతీ కాంగ్రెసుకు హాజరయ్యారు. కాంగ్రెసును తిరిగీ చేపట్టాలనే ఆతురత ఆయన ఎంతమాత్రమూ చూపించలేదు. మోతిలాల్ నెహ్రూ-శ్రీనివాసయ్యంగార్లకు కాంగ్రెసును తిరిగి గాంధీగారి పరం చేయ్యాలన్న అభిలాష లేదు. కాగా ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థులను నిలబెట్టి, ఎన్నికల తతంగమంతా నడిపించడానికి వారికి అధికారం కూడా ఇచ్చారు.

యు. పి. లో అపజయం

దేశవ్యాప్తంగా జరిగిన యీ ఎన్నికలలో మద్రాసు రాష్ట్రంలోనే కాదు-ఇంకా ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెసు అభ్యర్థులకే విజయం పరంపరలు లభించాయి. కాని యు. పి. లో మోతిలాల్ నెహ్రూగారి నియోజకవర్గంలో తీవ్రమయిన ఆశాభంగం కలిగింది. ఆ రాష్ట్రంలో ప్రజలను ప్రబోధించి, ఒకే త్రాటి మీదకి వచ్చేలా చేయడానికి ప్రచారం సరిగా జరగలేదు. అసలు అక్కడి ప్రచారశాఖే సరిగా యేర్పాటు చేయ చేయబడలేదు. నిజానికి ఆ నియోజకవర్గం జమీందారీ ప్రాంతం. ఆ ప్రాంతీయులకు జమీందార్లను ఎదిరించి నిలబడగల శక్తి లేదు. దానికి సరిపడ్డ ప్రచారమూ లేదు.

మోతిలాల్‌గారు ఈ ఓటమికి కారణం ప్రత్యర్థులు వ్యక్తి గతంగా తన్ను గురించి చేసిన దుష్ప్రచారమే నన్నారు. తాను గ్రామాలమ్మట తిరిగి, తనపై జరుగుతూన్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించలేదని ఒప్పుకున్నారు. అందువల్లనే ఓటమి సంభవించింది. ప్రత్యర్థుల తాలూకు ప్రచారకులు ఆయనపై మోపిన నేరాలను గురించి ఆయనే చెప్పారు. తాను గోమాంసం తింటున్నాడని, తనకు కావలసిన గోమాంసం లభ్యం కాదనే కారణంగా తాను గోవధను నిషేధించడనీ, మసీదులముందు ఊరేగింపులలోని బాజాభజంత్రీలను