పుట:Naajeevitayatrat021599mbp.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లన్నా మార్గాంతరం లేక అవస్థలు పాలవుతున్నారనీ వివరించాడు" సదాచార సంపన్నులైన హిందువులు మహమ్మదీయ మతంనుంచి హిందూమతంలోకి పున:ప్రవేశానికి ఒప్పుకోని కారణంగా హిందూ మతం క్షీణీస్తోందనీ, దీని కంతటికీ హిందూ నాయకుల ఉదాసీనతే కారణమనీ అన్నాడు.

లాలా లజపతిరాయి, స్వామీ శ్రద్దానందుల ఆధిపత్యంలో పనిచేస్తూ ఉన్న ఆర్యసమాజంవారు నిర్భయంగానూ, దృఢ చిత్తంతోనూ అవసరమైన సేవ చేస్తున్నారు. అహితాగ్నులలో అహితాగ్నిగా పేరు పొందిన మదన మోహన మాలవ్యాగారు తక్కిన కార్యనిర్వాహక వర్గీయులతో కలసి ముల్తాన్‌లో జరిగిన దురంతాలూ ప్రత్యక్షంగా చూసి, అక్కడ కూల్చబడిన ఆలయాలూ, విరగగొట్టబడిన విగ్రహాలూ కలిగించిన మానసిక క్లేశంతో, మొట్టమొదటిసారిగా తన నోటమ్మట తానే హిందూ సంఘ సంరక్షణకోసం "శుద్ధి సంగతం" అవసర మన్నాడు. అప్పటి వరకూ ఆర్యసమాజీకులు చేస్తూ వచ్చిన ప్రచారం తాను అందుకున్నాడు. యావత్తు భారత దేశాన్నీ ఆవరించి ఉన్న ఆర్యసమాజం తాలూకు మతాచార్యులకు స్వామీ శ్రద్దానంద ప్రారంభించిన "గురుకులమే" దీక్ష నిచ్చి తరిఫీదు నిచ్చింది.

రాజకీయ ప్రపంచంలో కూడా స్వామీ శ్రద్దానంద పేరుబడ్డ నాయకుడే. కాంగ్రెసు అధ్యక్షులకూ, వీరికి ఎప్పుడైనా అభిప్రాయభేదాలు వస్తే, అంటే-కాంగ్రెసు అధ్యక్షులకు స్వామీ శ్రద్దానందుని దృక్పధం సరిగా అర్థంకాని పరిస్థితులలో , ఆ సంగతి గ్రహించి స్వామీజి, స్పర్థలూ వాగ్వివాదాలూ పెరక్కుండా, చల్లగా బైటకువెళ్ళి పోయేవాడు. ఆయన అటువంటి పరిస్థితులలో చల్లగా జారుకోవడం కలకత్తా కాంగ్రెసులోనూ జరిగింది. ఆ ఉదంతం మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. స్వామీ శ్రద్దానంద లేని లోటుకు నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. అది ఎప్పటికీ తీరేలోటు కాదు.