ఊరినించి కనపర్తి తీసుకువెళ్ళారు. ఆ తరవాత మేము కనపర్తి శివారు వినోదరాయడుపాలెం గ్రామంలో కొంతకాలం ఉన్నాము.
మా తమ్ముడు జానకిరామయ్య అక్కడే జన్మించాడు. అతను జన్మించిన కొద్దిరోజులకి మా అమ్మగారికి మా కుటుంబం భవిష్యత్తు విషయమై ఆత్రత హెచ్చయింది. మా మేనమామల కుటుంబం కూడా సామాన్యమైన మధ్య తరహా కుటుంబమే. మా అమ్మగారికి వారిపైన ఆధారపడి ఈ సంసారం అంతా అక్కడ ఉంచడం ఎంతో అభిమానంగా ఉండేది. ఆ కాలంలో కుటుంబ నిర్వహణం అంటే చాలా దుస్తరమైన పని. ఉన్న భూమిలోనే సంవత్సరాని కంతకీ కుటుంబానికి కావలసిన ధాన్యాదులూ, దూడలికి కావలిసిన మేతా పండించుకోవలసి వచ్చేది. మా మేనమామల ఊళ్ళోవాళ్ళ స్థితిగతులు నాకు ఇప్పటికీ స్మరణకి వస్తున్నాయి. నేను కూడా తరచు పొలం వెళ్ళి మంచె మీద కాపలా కాస్తూ ఉండేవాణ్ణి. వాళ్ళీ పొలంలోనే నాలుగు మూలలా నాలుగు రకాల తినుబండారపు ధాన్యాదులు -- అంటే జొన్న, పెసర, కంది, మినుము, పరిగె, పత్తి మొదలైనవి -- పండించేవాళ్ళు. అల్లాగ మనుష్యుల కాయకష్టంమీద జీవించవలసిన రోజుల్లో ఒక సంసారంమీద ఇంకొక సంసారం పడడం అంటే మాటలా?
అప్పటికే ఇంగ్లీషు చదువుల ప్రాభవం ప్రారంభమైంది. కాస్త ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరడం, ఇంగ్లీషు పరీక్షలు ఇంటి పేళ్ళవడం ప్రారంభించాయి. అంటే బి.ఏ నారాయణస్వామి, యఫ్.ఏ శేషగిరి అయ్యారు అన్వర్థ నామాలు ఏర్పడ్డాయి. అందుచేతనే మా నాయనగారు మొదటినుంచీ మమ్మల్ని ఎల్లాగైనా ఇంగ్లీషు చదువు చదివించాలనే శ్రమపడుతూ ఉండేవారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అనే పెద్ద సమస్య తేలిపోయింది కనక, మమ్మల్ని ఇంగ్లీషు చదువుల్లో ప్రవీణుల్ని చెయ్యాలని ఆయన కోరిక. మా అమ్మగారు ఆయన కోరిక ఎల్లాగైనా సఫలం చెయ్యాలని సంకల్పించుకుంది. మా నాయనగారు పోయినప్పుడే మా అమ్మగారు "పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవలసి వస్తుందేమో!" అని అంటూఉండేది.