పుట:Naajeevitayatrat021599mbp.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగి ఉంటె తన ఆశయం ఏనాడో సిద్ధింప చేసుకోగలిగేది. 1921 నుంచి 1927 వరకూ ఆరు సంవత్సరాలపాటు మా కార్యక్రమం ఏమిటో ప్రచారం చేస్తూ ప్రజలను కూడగట్టుకుని రాగలిగిన మేమూ-మామోజు సహకార నిరాకరణం మీదనా, సహకారం మీదనా, అంటే సరిగా చెప్పలేని "త్రిశంకు స్వర్గం" లోనే ఉన్నామేమో అనిపించ సాగింది.

కేంద్ర సభలో 42 గాంధీ టోపీలు

ఎన్నికల అనంతరం క్రొత్తగా ఏర్పడిన కేంద్ర శాసన సభలో మాసంఖ్య 42. మద్రాసు మొదలైన వివిధ రాష్ట్రాలలో కాంగ్రెసువారు అత్యధిక సంఖ్యాకులుగానే ఎన్నికయ్యారు. కేంద్ర శాసన సభలో ఒక్క సారిగా నలభై రెండు గాంధీ టోపీలు కనబడ్డం ఆశ్చర్యకరమైన విషయం. కాంగ్రెసుపార్టీవారి ధాటికి తట్టుకోలేక, అప్పటివరకూ నిరంకుశంగా పరిపాలించిన పెద్దల కందరికీ కాళ్ళలో వణుకు పుట్టింది.

ఈ దిగువ అంశాలమీద చరిత్రాత్మకమైన వాదోపవాదాలు జరిగాయి: ప్రజాక్షేమం-రిజర్వు బ్యాంకి స్థాపన-మారకపు విలువ 1 షి 4 పెన్నీల నుండి, 1 షి 6 పెన్నీలకు హెచ్చించే విషయం.

మా పార్టీ వారికి నాయకుడు మోతిలాల్ నెహ్రూగారు. ఆయన మంచి నేర్పరి. విద్యాపారంగతుడు. సమర్థుడు. ఏ విషయం మీద చర్చ వచ్చినా, ఎట్టి క్లిష్టపరిస్థితి ఉత్పన్నమయినా నిలబడగల శక్తి ఆయనకుంది. ఆనాటి భారతావనిలో సాటిలేని మేటి ప్రతిభ వారిది. తలపెట్టిన కార్యం ఘనంగానూ, గౌరవ ప్రదంగానూ నిర్వహించగల శక్తి వారిది.

కాని ఆయన చాలా ఆత్మాభిమానమూ, పట్టుదలా గల మనిషి. తన పార్టీ సభ్యుల నందరనూ కూడగట్టుకుని తనవైపు ఆకర్షించుకోగల సహనమూ, ఓరిమి, నేర్పు ఆయనకి ఉన్నట్లు కనిపించలేదు. ఆయనకీ శ్రీనివాసయ్యంగారికీ మధ్య స్పర్థ ఉండేది. వ్యక్తిగతమయిన అభిప్రాయ భేదాలవల్ల మోతిలాల్ గారికీ, పి. ఎస్. రంగయ్యరుగారికీ పడుతూండేది కాదు. ఈ విషయాలు 1927-28 నాటి సంఘటనలలో రుజువయాయి.