పుట:Naajeevitayatrat021599mbp.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నదన్న విషయం వారికి ఎప్పటి కప్పుడు మా ఉపన్యాసాలలో తెలియచెపుతూ, అవసరమైన ప్రోత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలుగజేస్తూనే వచ్చాం. ఈ సంరంభం అంతా తమ కోసమేననీ, దీని జయాపజయాలన్నీ వారివేననీ స్పష్టీకరించాము. ఏ మాత్రమైనా స్తోమత ఉన్నవారు తమ స్వంత ఖర్చుమీద, తమకు అందుబాటులో ఉన్న కార్లూ, బస్సులూ మొదలైన వాహనాలలో వెళ్ళి, ఆయా జిల్లాలకు చెందిన వివిధ నియోజక వర్గాలలో ఉత్సాహంగా పనిచేశారు. ఈ ప్రకారంగా ప్రజలే నడుములు బిగించుకుని, ముందుకొచ్చి, తమ ఖర్చులు తామే పెట్టుకుంటూ ఎన్నికల తతంగం అంతా నడిపించు కొచ్చారు.

కాంగ్రెసు ఘన విజయం

సుమారు అన్నిస్థానాలలోనూ కాంగ్రెసు పేరిట జయం సాధించ గలిగాం. మా గెలుపు ఆంధ్ర రాష్ట్రానికే ఎంతో కీర్తినీ, ఘనతనీ చేకూర్చింది. నా నియోజకవర్గంలో సుమారు ఉన్న ఓటర్లందరూ ఓటు చేశారు. మోచర్ల వారు పదివేల వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన అనుచరులకుగాని, ఆయనకుగాని, ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెసు వారికి ప్రత్యర్థులుగా నిలచిన అభ్యర్థులకుగాని, అంతవరకూ దేశంలోనూ, ప్రజలలోనూ కాంగ్రెసు ఎంత పరివర్తన తీసుకు రాగలిగిందో, కాంగ్రెసువారు ఎంత గౌరవమూ, పలుకుబడీ సంపాదించ గలిగారో అర్థం కాలేదు.

సహకార నిరాకరణ పేరిట గత ఆరు సంవత్సరాలుగా జరిగిన ప్రచారం పలితంగా, ఆంధ్ర రాష్ట్రంలో వలెనే, మద్రాసు, దక్షిణ కన్నడ, మలయాళ ప్రాంతాలలో కూడా అఖండ విజయం సాధించింది. ఫలితాలు ప్రచురిస్తూన్న కొద్దీ, పరిపాలకులకూ, బ్రిటిషు వారికీ, ప్రపంచం అంతటికీ కూడా కాంగ్రెసుకు భారత దేశంలో ఉన్న స్థానం, బలిమి, కలిమి మొదలైనవన్నీ తెలియవచ్చాయి.

1926 లోనే ఇంత ఘన విజయం సాధించిన కాంగ్రెసు, తన నాయకులలో భేదాభిప్రాయాలు లేకుండా అంతా ఒకే త్రాటిమీద నడవ