పుట:Naajeevitayatrat021599mbp.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిలో ఆరు కొట్లాటలు జరిగాయి. ఈకొట్లాటలలో నిహతులయిన వారి సంఖ్య 250; క్షతగాత్రులు 2500 మంది.

ఇంచు మించుగా కలతలురేగి, అల్లర్లు జరిగిన అన్నిప్రాంతాలకూ నేను వెళ్ళాను. ఎటొచ్చీ ఆ వూరి అల్లరికీ, ఈ వూరి అల్లరికీ మధ్య వ్యవధిలేని సందర్భాలలో ఒకొక్క ఊరు వదలి వెయ్యవలసి వచ్చింది. నేను అల్లర్లు జరిగిన వెనువెంటనే వెళ్ళి, సంగతి సందర్భాలు విచారించి, ఇరుపక్షాలవారివద్దా సంజాయిషీ, సేకరించి, జరిగిన సంగతులన్నీ సకారణంగా నోటు చేసుకునేవాణ్ణి. చాలా ఘోరంగా జరిగిన నాగపూరు కొట్లాటల సంగతి విని అక్కడికి వెళ్ళాను. నాగపూరులోనూ, లాహోరు కొట్లాటల్లోనూ కూడా చాలామంది చంపబడ్డారు. పెక్కుమందికి గాయాలు తగిలాయి. ప్రతీ ప్రాంతంలోనూ శాంతిని నెలకొల్పి, మత సామరస్యాన్ని పునరుద్ధించడానికై శాంతి సంఘాలు స్థాపింపబడ్డాయి.

ఐకమత్య సూచనలు

అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు కలకత్తాలో 1927 అక్టోబరు 28, 29, 30 తేదీలలో కలుసుకున్నప్పుడు, కాంగ్రెసు ప్రెసిడెంటు శ్రీనివాసయ్యంగారి ప్రోద్బలంవల్ల జరిగిన ఐకమత్య మహాసభవారు హిందూ మహమ్మదీయ సంఘీభావానికి చేసిన సూచనలు ఆమోదించ బడ్డాయి. మసీదులముందు బాజా భంత్రీల వాయిద్యం విషయంలోనూ, గోహత్య విషయంలోనూ కొన్ని నియమాలు పాటించి, వాటిని క్రమబద్ధం చేయించాలని శ్రీనివాసయ్యంగారు చాలా శ్రమపడ్డారు. నిజానికి అనాడు కావలసింది మసీదుల ముందు మేళాతాళాలు వాయిస్తున్నారా, హిందువుల ముందు గోహత్య సాగిస్తూన్నారా అన్న మీమాంసకంటే, అందరికీ కడుపు నిండా అన్నం ఉన్నదా అన్న యోచనేనని నా నమ్మిక. ఈ అభిప్రాయమే నాకు ముఖ్య మిత్రులయిన శ్రీనివాసయ్యంగారి ముందు వెలిబుచ్చాను. కాని వారు తాము సూచించిన మసీదు ముందు వాయిద్యాలు, గోవధ క్రమబద్ధం అయితే చాలనే తలచారు.