పుట:Naajeevitayatrat021599mbp.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాండ సాగించాలనీ మహమ్మదీయుల బుర్రలకి బాగా పట్టిపోయింది. ఇంకా తమాషా యేమిటంటే, అలాంటి హింసాభావాల్ని పెంపొందించుకున్న వారిలో కొందరి భుజాలమీద అహింసా చిహ్నం కొట్టొచ్చినట్లు కనబడుతూ వచ్చింది. కాగా అటువంటి వారంతా కాంగ్రెసు యూనిఫారంలో తిరుగుతూన్న ప్రబుద్ధులే! ఈ విషయం, షహజాన్‌పూర్ ఉదంతాల అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించి కారణాలను గ్రహిద్దాం అని మేము ఆ ప్రాంతంలో పర్యటిస్తూన్న సందర్భంలో బయల్పడింది. కాంగ్రెసు స్వయం సేవక సంఘం తాలూకు వాలంటీర్లూ, కాంగ్రెసు యూనిఫారంలో నడయాడుతూన్న మహమ్మదీయ స్వయంసేవకులూ, కత్తిసామూ, కర్రసామూ వగైరాలలో తర్పీదు పొందుతున్నారన్న విషయం అప్పుడు రుజువయింది. ఈ విషయం మనస్సులో ఉంచుకుంటే పాఠకలోకానికి అనాటి హిందూ, మహమ్మదీయ మస్తిష్కాలలో ఎటువంటి ఊహలు కలిగేవో, 1923 నాటి షహజాన్‌పూర్ సంఘటనలు ఎలా సంభవించాయో అన్నీ బాగా అర్దం అవుతాయి.

మీరట్ సంక్షోభం

మూడవ దఫా సంభవించిన హిందూ మహమ్మదీయ సంక్షోభం మీరట్‌లో. అప్పట్లో అక్కడ పేరూ, పలుకుబడి ఉన్న రాజకీయనాయకులలో నా మిత్రులయిన బారిష్టర్లు కొందరున్నారు. అక్కడ ఆ కొట్లాట జరిగిన మరుక్షణమే నేను అక్కడికి వెళ్ళాను. కాని ఉభయ పక్షాల నాయకుల ఆవేశాలు బాగా పెరిగిపోయి ఉండడం చేత అప్పటి కప్పుడే నిష్కపటంగానూ, ధారాళంగానూ, స్వేచ్చగానూ, మా మనోభావాలను మరుగుపరచకుండా వారితో చర్చించగల అవకాశం మృగ్యమయిందనే అనవలసి ఉంది. చర్చించాం, బాగా లోతుగానే తర్జనభర్జనలు సాగించాం. కాని ఎంతసేపూ అవతలివారిదే దోషము అనే ధోరణిలోనే నడిచింది వారితో చర్చ. మీ వల్లనే కొంప లంటుకున్నా యని హిందువులంటే, మీ వల్లనే సర్వనాశన పరిస్థితి ఏర్పడిందని మహమ్మదీయులన్నారన్నమాట!