Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు. ఆయనతో స్నేహం చేస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. ఆయన తరవాత సబ్‌జడ్జీ పనికూడా చేశాడు. మొత్తం మీద అల్లరికి ప్రఖ్యాతి పొందుతూ, చదువు సాగించాను. ఏవైనా వస్తువులు కావలిస్తే అవి వున్నవాళ్ళ దగ్గిర లాక్కోవడమూ, వాళ్ళు మా అమ్మగారి దగ్గిర ఫిర్యాదులు చేయడమూ జరుగుతూ వుండేవి. ఇల్లాంటి తవ్వాయి లెన్నో ఆ ఇల్లాలు తీర్చింది!

నేను దండాలు, కుస్తీలు మొదలయిన తాలింఖానా వ్యవహారాల్లో అప్పటికే ముందంజ వేశానని ఇదివరకే చెప్పాను. దేశంలో అప్పటికే క్రికెట్టు ఆట ప్రవేశించింది. ఆ ఆటలో కూడా ప్రవేశం కల్పించుకున్నాను. ఆ కాలంలో వెంకటగిరి రాజావారి ఏనుగులు వేసవికి సువర్ణముఖి దగ్గిర తోటల్లో విడిసి వుండేవు. నేనూ, కొంతమందీ కలిసి మావటివాడికి కానో అర్ధణో ఇచ్చి, ఆ ఏనుగులెక్కి షికారులు కొట్టే వాళ్ళము. తరచు ఆ సువర్ణముఖి ఇసక తిన్నెల్లోకి తినుబండారాలు పట్టుకుపోయి, అక్కడ ఒకటి రెండురోజులు మకాం వేసి, ఆటపాటలతో కులాసాగా కాలక్షేపం చేస్తూ వుండేవాళ్ళము. మొత్తంమీద నాయుడుపేట విద్యార్థి దశ మొదటికాలం ఒకవిధమైన గణనీయతతో, కులాసాగానూ, నిర్లక్ష్యంగానూ గడిచిపోయింది.

ఆ రోజుల్లో నాయుడుపేట ఒక చిన్న గ్రామం. ఇళ్ళు చాలా సకృత్తుగా ఉండేవి. ఆ గ్రామానికల్లా ఘనమైన విషయాలు మా బడీ, సువర్ణముఖు కాలువగట్టున ఉండే అన్నపూర్ణ దేవాలయమూ, వెంకటగిరి వారి ఏనుగులు విడిసే ఠాణా మాత్రమే. మా నాయనగారు పొరుగూళ్ళో ఉద్యోగం అవడంచేత మమ్మల్ని ఒక స్వాములవారి మఠానికి చేరి వుండే చిన్న పూరి ఇంట్లో వుంచారు.

రెండు మూడు సంవత్సరాలు- అంటే నేను మోడరన్ థర్డురీడరు చదివేవరకు - మా కుటుంబం అంతా నాయుడుపేటలోనే వున్న రోజుల్లో, మా నాయనగారిని ఎస్టేటు వారు మల్లాం పారుపత్యానికి బదిలీ చేశారు. అందుచేత, ఆయన కుటుంబం మల్లాం తీసుకుపోయారు. నన్ను ఆ మఠంలోనే వుంచారు. అక్కడ కన్నేపల్లి వెంకమ్మగారనే