పుట:Naajeevitayatrat021599mbp.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాకు కనబడిన దృశ్యం చాలా బీభత్సంగానూ, భయోత్పాతంగానూ ఉంది. తగల బెట్టబడిన షాపులూ, హత్యలు జరిగిన తావులూ, కొల్లగొట్టబడిన ఆలయాలూ, విరగ్గొట్టబడిన విగ్రహాలూను. ఎక్కడ చూచినా ఇదే దృశ్యం. ముఖ్యంగా ఆరు అడుగుల ఎత్తూ, మూడడుగుల వెడల్పూ గలిగిన సుందర విగ్రహం ఒకటి రెండు ముక్కలుగా పడి ఉండడం ఇంకా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, నాకళ్ళకు కట్టినట్ట్లే ఉంది. అందమయిన ఆడవారు తమకు జరిగిన అన్యాయాలను గురించి విన్నవించుకోడానికి మమ్మల్ని చుట్టుముట్టారు. వారు స్త్రీ జన సహజమయిన సిగ్గూ, లజ్జా వదలి బాహాటంగా కమిటీవారి ఎదుట తమకు జరిగిన అవమానాలూ, మానాపహరణాలూ చెప్పలేకపోయారు. పాపం, వారు ఆ పద్మాషుల చేతులలో ఎంతెంత బాధలు అనుభవించారో కదా! ఆ హృదయ విదారక విషయాలన్నీ స్వయంగా విన్నవారిలో ఒక్క మాలవ్యాగారు మాత్రమే నిగ్రహించుకో గలిగారు.

హిందూ వనితను కాపాడిన మహమ్మదీయ స్త్రీ

ఒక మహమ్మదీయ స్త్రీ సాక్ష్యాన్ని తీసుకోవడానికి మమ్మల్ని ఒక మహమ్మదీయుని ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆమె పరదా వెనుక నుంచే సాక్ష్యం ఇచ్చింది. ఒక హిందూ యువతిని రౌడీలు ఎల్లా తరిమారో, ఆమె ఎల్లా ఎల్లా తప్పించుకుని తన యిల్లు జొచ్చి రక్షణ కోరిందో అన్నీ వివరించింది. ధైర్యం వహించి ఎల్లా తను ఆ అమ్మాయి లోపలికి ప్రవేశించిన వెంటనే గభాల్న తలుపులు బిగించి, గుండాల రాకను అరికట్ట గలిగిందీ వర్ణించింది. ఆ అమ్మాయిని బైటకు పంపించకపోతే వారు ఇల్లెక్కి పెంకులు ఊడదీసి అల్లరి పెడతాం అని యెంత బెదరించినా లొంగక ధైర్యంగా ఆ పిల్లకు రక్షణ యిచ్చింది. ఆమె చెపుతూన్న యీగాథ విన్న మా కమిటీ మెంబర్ల కందరకూ కళ్ళవెంబడి నీళ్ళు కారాయి. మేము ముల్తాను వదిలే లోపల మాకు విడిదిగా ఇవ్వబడిన ధర్మశాల అవ