లాలూ ఇంకో ప్రక్కనుంచీ జాతీయోద్యమాన్ని దిగలాగాయి. లార్డ్ రీడింగ్ వైస్రాయిగా రిటయిరై ఇర్విన్ ప్రభువునకు రాజ్యాంగాన్ని ఒప్పగించిన రోజు ఎటువంటిదోగాని, ఆనాడే, ఆ 1926 ఏప్రియల్ 6 వ తేదీనాడే, అదే ఘడియలలో హిందూ మహమ్మదీయ సంఘర్షణలు చెలరేగి, ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి.
16
మతవర్గాల మధ్య మళ్ళీ మళ్ళీ కలహాలు
ముల్తాన్‌లో 1922 లో హిందూ మహమ్మదీయ సంఘర్షణలు సంభవించింది మొదలు, ఏటేటా వివిధ ప్రాంతాలలో హిందూ మహమ్మదీయ కలహాలు జగుతూనే వచ్చాయి. నేను కేంద్ర సభలో సభ్యుడుగా ఉంటూ కూడా, "స్వరాజ్య" పత్రికా నిర్వహణ చూసేవాడిని. ముల్తాన్ కొట్లాటలు లగాయితు దేశంలో ఎక్కడ ఏ మారుమూల కొట్లాటలు జరిగినా అక్కడికి హుటాహుటీ వెళ్ళేవాడిని. ముల్తాన్ సంఘటనలు జరిగి సంవత్సరం తిరగకుండానే షహజాన్‌పూరులో కొట్లాటలు చెలరేగి, తర్వాత మీరట్‌లోనూ, బెరిల్లీలోనూ జరిగిన కొట్లాటలు ఇతర ప్రాంతాలకు ప్రాకి, నాగపూరు, లాహోరు, కలకత్తాలలో కూడా సంఘర్షణలు జరిగాయి.
ముల్తాన్ కొట్లాటల నాటికి నేనింకా వర్కింగు కమిటీ మెంబరుగా ఉంటూ ఉండడాన్ని, ఇతర మెంబర్లతో కలసి ముల్తాను వెళ్ళానని లోగడ తెలిపి ఉన్నాను. మదనమోహన మాలవ్యా, హకీం అజ్మల్‌ఖాన్, అబ్దుల్ కలాం అజాద్, రాజేంద్రప్రసాద్, జమన్‌లాల్ బజాజ్, వల్లభ్‌భాయి పటేల్, సి. రాజగోపాలాచారిగార్లు, నేను కలిసే ముల్తాన్ వెళ్ళాము. అక్కడి సంగతులన్ని స్వయంగా విచారించి సంగతి సందర్భాలు సవ్యంగా గ్రహించాలనేదే మా ఉద్దేశం. స్వరాజ్య పత్రికా సంపాదకునిగా కూడా నాకు ఈ విషయాలు ఆమూలాగ్రంగా గ్రహించాలనే ఆదుర్దా ఉండేది.