మొదలైనవి ఉంటూ ఉండేవి. ఆ రోజుల్లో బి.ఏ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం అంటే ఘనమైన మాట! అప్పట్లో నారాయణస్వామిచెట్టి అనే ఆయన బి.ఏ అయి, పేష్కారు వుద్యోగంలో ప్రవేశిస్తే ఆయనకి బి.ఏ నారాయణస్వామిచెట్టి అనే పేరు వచ్చింది. ఇల్లాంటి సంస్థానంలో మా నాయనగారు రెండుసార్లు ఉద్యోగం పోగొట్టుకుని, మళ్ళీ అనేకమైన ఆశ్రయింపులు ఆశ్రయించి ఉద్యోగం సంపాదించుకున్నారు.
నాయుడుపేటలో నా చదువు గురించీ, జీవితాన్ని గురించీ కొంచెం విస్తరించి వ్రాస్తాను. నాయుడుపేటలో ఒక గవర్నమెంటు స్కూలు ఉండేది. అందులో ఫస్టు, సెకండు, థర్డు, ఫోర్తు, అప్పరు ఫోర్తు అని అయిదు క్లాసులు ఉన్నట్లు జ్ఞాపకం. ఆ క్లాసుల్లో బ్రాద్‌షా రీడర్లు చదువుతూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ఇంగ్లీషు తెలుగు వగైరాలతోబాటు ఉర్దూ కూడా చెబుతూ ఉండేవారు. నేను ఆలీబేగ్ అనే సాహేబుల కుర్రవాడితో కలిసి ఉర్దూ చదవడం జ్ఞాపకం ఉంది. నాయుడుపేటలో చదువుకునే రోజుల్లో నేను బుద్ధిమంతుణ్ణి అనిపించుకున్నానని చెప్పవీలులేదు. వయస్సు ఎంతో లేకపోయినా, స్కూలులో ఉన్న అల్లరి పిల్లలలో మనపేరు మొదటిదిగా ఉండేది.
నాకు, ఎక్కడికి వెళ్ళినా రెండురకాల మిత్రుల స్నేహాలు తటస్థపడుతూ వుండేవి. పరమపోకిరీల స్నేహం ఒకవైపున! బుద్ధిమంతులు, సంపన్న గృహస్థులు, విద్యావంతులు మొదలైన పెద్దవాళ్ళ స్నేహం రెండోవైపున! కానూరి రంగడు అని ఒకడు ఉండేవాడు. అతని అసలు పేరు రంగారావు. అతను మాధ్వుడు. అతనితో మొదటి స్నేహం సాము, గరిడీ, కుస్తీలు, చెడుగుళ్ళు మొదలైన వాటిల్లో. అతనొక చిత్రమైన మనిషి. రోజూ అతను సువర్ణముఖి ఒడ్డున వుండే ఆంజనేయస్వామికి కోడిగుడ్లు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అందరికీ ఇస్తూండేవాడని ప్రతీతి. చాలామంది, "అతను దుర్మార్గుడు; చదువూ సంధ్యా లేనివాడు; అల్లాంటి వాడితో నీకు స్నేహం ఏమి?" టని నన్ను మందలించేవారు. నాకు అతని స్నేహం వల్ల అలవాటయినవి బడి