పుట:Naajeevitayatrat021599mbp.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలామంది అకాలీలు పించను పుచ్చుకున్న సిపాయిలు, మిలిటరీ వారు. తీవ్రమైన పోరాటాలలో ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడానికి వెనుకాడిన బాపతు కానేకారు. అనేక యుద్ధాలలో ఆంగ్లేయల తరపున పాల్గొన్నవారే వారు. కాని వారికి ఆంగ్ల పరిపాలకులతోనూ, వారి ఉద్యోగస్థులతోనూ తగాయిదా ప్రారంభం అయిన కారణంగా, వారు తీవ్ర యుద్ధ విధానాలకంటె గాంధీగారి అహింసాత్మక సత్యాగ్రహ విధానమే ఉత్తమమయినదని భావించారు.

వైద్యశాల-వంటసాల

వారిపై ఆంక్ష విధింపబడిన వెంటనే వారు దానిని ఉల్లంఘించి తీరుతామని తెలియజేశారు. తమపై ఆంగ్లేయులు హింసాకాండ సాగిస్తారని, దానిని ఒక యుద్ధంలాగే భావించాలనీ వారికి తెలుసు. ఆ పరిస్థితులలో తీవ్రంగా గాయపడడానికి బాగా అవకాశం ఉన్నదని తెలుసు. అందువలన వారు ఆ పోరాటం జరుగుతున్న స్థానానికి సమీపంగా పెద్ద ఆస్పత్రిని ఏర్పరచుకున్నారు. అవసరమైన వైద్యం చేయడానికి నర్సులూ, డాక్టర్లూ కూడా కాణీ ఇవ్వనవసరం లేకుండానే తయారయ్యారు. ఆస్పత్రికి సమీపంగానే ఒక "లంగర్ ఖానా" (వంటసాల) ఏర్పాటు చేసుకున్నారు. ఆ లంగర్ ఖానాలోని యేర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.

దాస్‌గారూ, నేనూ, బాబూ రాజేంద్రప్రసాదూ, మరికొంత మంది కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గ సభ్యులు వెంటరాగా, ఆ లంగర్ ఖానా, ఆస్పత్రి, వగైరా యేర్పాట్లన్నీ చూశాము.

ప్రభుత్వంవారు చేసిన యేర్పాట్ల ప్రకారం అకాలీలు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి ఆస్కారంలేదు. ఆలయం చుట్టూ పోలీసు నిఘా వేశారు. పోలీసుల చేతులలో దిట్టమయిన లాఠీలున్నాయి. అకాలీలు ఎవరయిన ఆలయ సమీపానికి వచ్చినా, ఆలయ ప్రవేశానికి ప్రయత్నించినా, వారి యెముకలు చితగ్గొట్టడానికి ప్రభుత్వంవారు సర్వసన్నద్ధు లయ్యారన్నమాట. అక్కడ అకాలీలు సత్యాగ్రహ పద్ధతులమీద చేసుకున్న యేర్పాట్లన్నీ మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి.