ఆయన మరణానంతరం బెంగాలు పూర్తిగా తేరుకోలేక పోవడానికి కారణం అక్కడ ఉన్న పార్టీ విబేదాలూ, చీలికలూను. మేము కొన్ని కొన్ని విషయాలలో భేదాభిప్రాయంతో ఉంటూ ఉన్నా, మా ఉభయుల మధ్యా వ్యక్తిగత గౌరవాలూ, ఆదరాభిమానాలూ కించిత్తు కూడా తగ్గలేదు.
14
గురుకాబాగ్ సత్యాగ్రహ సందర్శనం
ఈ సత్యాగ్రహం [1]అకాలీలచే ప్రారంభింపబడింది. వారిని ఒక సిక్కుల ఆలయంలోకి రానివ్వని కారణంగా, తమ హక్కులను సుస్థిర పరచుకోవడంకోసం అకాలీలు ఈ సత్యాగ్రహ సమరం ఆరంభించారు. ఆ ఆలయాధికార్లు ఈ అకాలీలకు అందులో ప్రవేశించే అర్హత లేదని నిర్ణయించారు. అకాలీలు ఆ తీర్పు సవ్యమయినదీ, న్యాయమయినదీ కాదనిన్నీ, అందువలన తాము ఆలయంలో ప్రవేశించి తీరుతామనీ చెప్పి ఆలయ ప్రవేశానికి సిద్ధపడ్డారు.
అకాలీల మీద ఆంక్ష
అ ఆలయ పాలకులు ప్రభుత్వంవారి సహాయం కోరారు. అకాలీల ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వంవారు సి.ఆర్.పి.పి.,144 వ సెక్షను క్రింద ఆర్డరు వేశారు. ఆ ఆంక్షను పాటించకుండా ఆలయ ప్రవేశం చేసితీరాలని అకాలీలు నిశ్చయించుకున్నారు. కాగా వారు గాంధీగారి అహింసాత్మక సత్యాగ్రహ పద్దతులను అనుసరించారు. కేవలం అనుసరించడమే కాదు, ఆ పద్ధతులకు మెరుగు దిద్ది, వాటిని ఎంతో పకడ్ బందీగా తయారుచేశారు. సత్యాగ్రహ విధానాలకూ, మిలిటరీ పద్దతులకూ జత కలిపారు
- ↑ 1923 లో