పుట:Naajeevitayatrat021599mbp.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవిచ్చిన్న సేవచేస్తూ, నిర్దేశింపబడిన మూడు లక్షల మూలధనాన్నీ సేకరించి, దారిలో పడిన పత్రికను మూసివేయడం మాటలతో పని కాదనిన్నీ మాత్రం చెప్పాను. అది నా ఒక్కడికీ చెందిన స్వంత వ్యవహారమే అయి ఉంటే, నిమిషాలమీద ఆయన ఆజ్ఞను పాలించే వాడిననీ వ్యక్తం చేశాను. ఈ పత్రిక ప్రజలచే స్థాపింపబడినదనిన్నీ, నేను ప్రజలపట్ల విశ్వాసంతో దీనిని నడుపుతున్నాననీ చెప్పాను.

ఇన్ని సవ్యమయిన సంగతులు చెప్పినా, ఆయనకు సంతుష్టి కలిగినట్లు లేదు. ఈ విషయంలో మిత్రులతో సంప్రతించి వారి పేర వ్రాస్తానని చెప్పి, సెలవు తీసుకుని వచ్చేశాను.

ఆయన ఇచ్చిన ఆదేశం విషయం సుదీర్ఘంగానే ఆలోచించాను. ఆ రోజున ఆయన సలహా పాటించి ఉండి యుంటే, ఈ రోజున చాలా లాభాలు పొంది ఉండేవాణ్ణి. నా సొంత పూచీ పైన బ్యాంకులలో అప్పులు తెచ్చి, పేపరులో పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. ఆనాడు ఆయన నా కిచ్చింది, ఆత్మీయులైన అన్నదమ్ముల సలహాలాంటిది. సుమారు అయిదు లక్షలవరకూ ఉన్న బ్యాంకి నిలవలూ, రాజమండ్రీ నుంచి నీలగిరులవరకూ ఉన్న స్థిరాస్తులూ చెక్కు చెదర కుండా ఉండేవి. 1924 తర్వాత నేనూ, నా కుటుంబీకులూ ఇక్కట్ల పాలయేవారమే కాదు.

గాంధీగారి సూచనను గురించి, చాలామంది స్నేహితులతో సంప్రతించాను. కొంతమంది వారి సలహా పాటించమనీ, ఇతరులు ఆ సలహా పాటించినట్లయితే చెన్న రాజధానిలో కాంగ్రెసు మనుగడకే మోసం వస్తుందనీ సూచించారు. ఒకప్పుడు గాంధీగారు దక్షిణ ఆప్రికాలో వారు నడుపుతూన్న వారపత్రిక మూసివేయవలసిన సందర్బంలో, మూయడం మంచిది కాదు అంటూ, వెలువరించిన కారణాలన్నీ నాకు స్ఫురణకు వచ్చాయి, వారపత్రిక మూయడం విషయంలో వారు సూచించిన కారణాలన్ని, ఇప్పుడు స్వరాజ్య పత్రిక మూసివేయడం విషయంలో నా హృదయంలో భారంగా నాటుకున్నాయి.