12
గాంధీగారి విడుదల:జూహూ సంప్రతింపులు
ఆ రోజులలోనే గాంధీగార్ని ఆపరేషన్ నిమిత్తం యరవాడ జైలునుంచి "సెసూన్" హాస్పిటలుకు మార్చారు. దరిమిలా విడుదల చేశారు. ఆయన విడుదలై జైలునుంచి బయటికివచ్చి పరిస్థితులను విలియా వేసుకునే దాకా అవి ఎల్లాంటి పరిణామాలను పొంది ఎల్లా ఎల్లా మారాయో అన్న సంగతి అర్థం కాలేదు. తన సన్నిహిత అనుచరులూ, దేశ సేవకులూ ఎల్లా వ్యవహరించి ఆయన తలపెట్టిన విధానాలకు ఎటువంటి విఘాతాలు తీసుకు వచ్చారో అప్పటికిగాని ఆయనకు అర్థం కాలేదు. విడుదల అయ్యాక విశ్రాంతి కోసం, బొంబాయికి సమీపాన ఉన్న జూహూ సముద్ర తీరాన కొంతకాలం ఉండమని ఆయనకు డాక్టర్లు సలహా యిచ్చారు.
గాంధీగారు జూహూ మకాంలో ఉండగానే, ఆ విశ్రాంతి రోజులలోనే అనేకులతో సంప్రతింపులు జరిపారు. అ సంప్రతింపులన్నీ "జూహూ సంప్రతింపు"లనే పేరుతో ఒక అధ్యాయాన్నే రూపొందించాయి. గాంధీగారు తన కార్యక్రమానికి అనుగుణంగా తనచే ప్రతిపాదింపబడిన బహిష్కరణ విధానాల నన్నింటినీ పునరుద్దరించమన్నారు. కాని, దాస్-మోతిలాల్‌గారలు దానికి వ్యతిరేకించారు. ఆ ఇరుపక్షాల మధ్యా నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ "జూహూ విభేదా"లన్న పేరున ప్రచురింపబడ్డాయి.
బెల్గాం కాంగ్రెసు అధ్యక్షత
ఆ తర్వాత అహమ్మదాబాదులో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగు జరిగింది.[1]ఆ మీటింగులో గాంధీగారి స్థానం తిరిగి ప్రతిష్ఠ చేయబడింది. ఆ సంవత్సరంలో బెల్గాంలో జరుపదలచిన కాంగ్రెసుకు
- ↑ 1924 జూన్‌లో.