పుట:Naajeevitayatrat021599mbp.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాస్ పార్టీవారికి "కౌన్సిల్ ఎంట్రీ"కి అనుమతి నిచ్చి, రెండు మాసాలయినా కాకుండానే, దాన్ని తిరగ తోడించడం అన్నది అవివేకం అనే కారణాన్ని, ఆంధ్ర మిత్రుల నందరినీ డిల్లీ తీర్మానాన్ని బలపరచ వలసిందని కోరాను. కాని యువక బృందం గయా తీర్మానాన్నే పట్టుకు కూర్చున్నారు. ఈ విషయంలో మేము చీలిపోయాము. ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు నేను ఒక్క వోటు మెజారిటీతో ఓడిపోయిన కారణంగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్ష స్థానానికి రాజీనామా ఇచ్చాను.

వాలంటీరు పని

ఈ వ్యతిరిక్త భావాలతో వాలంటీర్లలో ఉండవలసిన క్రమశిక్షణ కుంటుపడింది. కాంగ్రెస్ సెషన్స్‌లో బాడ్జి వేసుకుని పనిచేయడానికి వాలంటీర్లు నిరాకరించారు. అప్పుడు నేను ఒక వాలంటీరు బాడ్జి తగిలించుకుని పనిచేయడం ప్రారంభించాను. దాన్తో ఇతరులు కూడా నన్ను అనుసరించారు.

ఆరోగ్యం పూర్తిగా చెడుటవలన విడుదలయిన[1] గాంధీగారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూండగా నేను సకుటుంబంగా చూడడానికి వెళ్ళినప్పుడు, గాంధీగారు యీ ఉదంతాన్ని గురించి కూడా మాట్లాడారు.

నా సహచరులయిన నాయక బృందం ఒక్క ఓటు మెజారిటీతో నన్ను ఓడించినంత మాత్రం చేత, ఇతర డెలిగేట్ల పైనా, ప్రజలపైనా ఉన్న నా విశ్వాసం సడలలేదు. నేను చాలాసేపు కాంగ్రెసు సమావేశంలో మాటలాడవలసి వచ్చింది. చివరికి నాతో అభిప్రాయభేదం ఉన్న డాక్టరు సుబ్రహ్మణ్యంగారు కూడా మాటలాడవలసి వచ్చింది

చివరికి జయం

చివరికి నా దృక్పథమే అధిక సంఖ్యాకుల ఆమోదాన్ని పొందింది. డిల్లీలో "స్పెషల్ కాంగ్రెస్" వారిచ్చిన అనుమతి దృఢతరం అయింది. ఈ విషయంలో ఎంతో ఆతురతతో ఉన్న దాస్‌గారూ సంతసించారు.

  1. 1924 పిబ్రవరిలో.