పుట:Naajeevitayatrat021599mbp.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారిగారి ప్రోగాంతోగాని సామరస్యం కుదరలేదు. లోగడ విన్నవించినట్లు, నేనున్నూ కొంతమంది మిత్రులమున్ను కలసి, నో ఛేంజి ప్రో ఛేంజ్ పార్టీల మధ్య ఏర్పడిన అగాధం విస్తరించకుండా చూడాలనే ఉద్దేశంతో "సెంటర్-పార్టీ"ని నెలకొల్పాం'

రా. కాం. అధ్యక్ష పదవికి రాజీనామా

డిల్లీలో మహమ్మదాలీగారి అధ్యక్షతను జరిగిన స్పెషల్ కాంగ్రెస్[1] ఆవరణలోకి కూడా నేను ఇన్‌ప్లూయంజా కారణంగా వెళ్ళలేక పోయాను. నేను డిల్లీ చేరిన వెంటనే పట్టుకున్న ఈ ఇన్‌ప్లూయంజా, కాంగ్రెసు పూర్తి అయిన వారం పది రోజులదాకా నన్ను వదలనే లేదు. అందువల్ల ఈ స్పెషల్ కాంగ్రెస్‌లో దాస్‌పార్టీ వారికి 1924 లో జరుగబోయే ఎన్నికలలో అభ్యర్థులుగా నిలిచి పోటీ చేయడానికి ఇవ్వబడిన అనుమతి విషయంలో నోరు విప్పి మాటలాడే సావకాశం కూడా నాకు లభించలేదు.

కాకినాడ కాంగ్రెస్‌లో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు నేను దాస్‌పార్టీ వారికి వ్యతిరేకంగా వ్యవహరించి, డిల్లీలో స్పెషల్ కాంగ్రెస్ వారు దాస్‌గారికి అనుకూలంగా చేసిన తీర్మానాన్ని కాకినాడ కాంగ్రెసు వారిచే తిరగ తోడించాలో, దాస్‌పార్టీవారితో చేతులు కలపాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. డిల్లీ "స్పెషల్ కాంగ్రెస్"వారు

  1. మేలో బొంబాయిలో అ. భా. కాం .సం. చేసిన తీర్మానాన్ని కొన్ని రాష్ట్రీయ సంఘాలు ధిక్కరించిన మీదట, జూలైలో నాగపూరులో మళ్ళీ అ. భా. కాం. సం. సమావేశం జరిగింది. శాసన సభా బహిష్కార విధానాన్ని పునర్విచారణ చెయ్యడానికి ఒక ప్రత్యేక కాంగ్రెసును సమావేశ పరచాలనే తీర్మానాన్ని మధ్యమ కక్షివారు అంగీకరింపజేశారు. సెప్టెంబరులో డిల్లీలో సమావేశమైన ఆ ప్రత్యేక కాంగ్రెసు శాసన సభా ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్మానం చేసింది. ఆ విధంగా శాసన సభా ప్రవేశ వాదులు తమ పట్టు సాధించారు.