పుట:Naajeevitayatrat021599mbp.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆందోళన ప్రాముఖ్యం

నాగపూరు జెండా సత్యాగ్రహ ఉధ్యమం ఘనవిజయానికై జనులను ఉత్తేజపరచి, వారిలో నవచైతన్యం కలుగజేయాలనే ఉద్దేశంతో నేనూ, విఠల్‌భాయ్ పటేలూ, సరోజినీదేవి కలిసి నాగపురంలో బహిరంగ సభలలో ఉపన్యసించాము మన జాతీయ పతాక గౌరవం కాపాడడానికి ఆరంభం అయిన ఈ ఆందోళన అన్నది, సరిగా ఆలోచించి చూస్తే, మానవుడు మానుషంగల మనిషిగా బ్రతకడానికి అవసరమైన జీవన్మరణ సమరమే అవుతుంది. అప్పట్లో నాగపూరులో జాతీయ పతాకం అణగద్రొక్కబడిఉంటే, అది కాంగ్రెసు జీవితానికే గొడ్డలి పెట్టయి స్వతంత్రోద్యమం అధ:పాతాళానికి దిగిపోయి ఉండేది.

ఆ రాష్ట్రంలో జమన్‌లాల్ బజాజ్ లాంటి ఉత్తమనాయకునివెంట 80 మంది కంటె ఎక్కువగా జైళ్ళకు వెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉత్పన్నమయినప్పుడు, అట్టి జనాన్ని ఉద్రేకపరచి, జాతి గౌరవ మర్యాదలు నిలుపుకోవడానికి ఏ పద్ధతుల మీద, ఏయే విషయాలు చర్చిస్తూ, ఎలాంటి ఉపన్యాసాలు, ఎవరెవరిచేత ఇప్పించడ మన్నది సమస్యే అయింది.

మే మిచ్చిన హామీ

ఆ విషమ పరిస్థితులను గ్రహించి, నేనూ, ఇతర మిత్రులమూ కలసి ఆ రాష్ట్ర ప్రజలతో యేమన్నామో తెలుసా? "ఇటువంటి జాతీయ సమరంలో ఇలాంటి విషమ ఘట్టాలలో మీ రాష్ట్రంలో 81 వ వాడిని అనుసరించడానికి మనుష్యులు దొరక్కపోతే, ఇతర రాష్ట్రాల నుంచి తండోప తండాలుగా జనాన్ని ఇక్కడికి పంపించి, మీ మా గౌరవాలు కాపాడుతాము" అన్నాము. "నా మట్టుకు నేను మా ఆంధ్రరాష్ట్రంనుంచి జెండాలతో సహా వేలాది వాలంటీర్లను పంపించగలనని హామీ ఇస్తున్నాను. ఈ హామీ నేను వ్యక్తిగతంగానే గాక, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా కూడా ఇస్తున్నాను," అని నమ్మబలికాను.