పుట:Naajeevitayatrat021599mbp.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా జోస్యం నిజమైంది

1923 వ సంవత్సరం మే 26-27 తేదీలలో బొంబాయిలో అఖిల భారత కాంగ్రెసు సంఘంవారు సమావేశమయ్యారు.

ఈ సభవారు గయా కాంగ్రెసులో శాసన సభా బహిష్కారానికి అనుకూలంగా ఆమోదింపబడిన తీర్మానాన్ని రద్దుచేశాం అన్నారు. అ విధంగా లోగడ నేను చెప్పిన జోస్యం, తు.చ.తప్పకుండా నిజమయింది. రెండు మాసాల విరమణ శాశ్వత విరమణకు దారితీస్తుందనీ, అలాంటి అవకాశం కలుగజేస్తున్న కారణంగానే నేను నా కార్యనిర్వాహకవర్గ సభ్యత్వానికి రాజీనామా యిస్తున్నానని చెప్పిమరీ రాజీనామా యిచ్చాను గదా! ఆ తాత్కాలిక విరమణ, నేను అన్నట్లుగానే, శాశ్వత విరమణ అయివూరుకుంది. ఈ శాశ్వత విరమణ అంగీకారం పొందిన కారణంగా, వర్కింగ్ కమిటీనుంచి ఆర్గురు సభ్యులు తప్పుకున్నారు.[1] వైదొలగిన వారందరూ నో చేంజి దృక్పథంవారే. వీరి రాజీనామాలతోపాటు చిత్తరంజన్ దాస్‌గారి రాజీనామా కూడా అంగీకరింపబడింది.

మధ్యమ వర్గావతరణ

దాన్తో డాక్టరు అన్సారీ నాయకత్వాన ఒక నూతన కార్యనిర్వాహకవర్గం అవతరించింది. దాస్-మోతిలాల్‌నెహ్రూగార్ల పార్టీలో చేరని నేనూ, డా॥అన్సారీ, సరోజనీదేవీ కలసి, యింకా ఇద్దరు ముగ్గుర్ని కూడదీసుకుని, ఇంకో క్రొత్త కక్షి లేవదీశాము. మే నెలలో "తాత్కా

  1. కారణం: గయా కాంగ్రెస్ ఆమోదించిన శాసన సభా బహిష్కారం గురించి ప్రచారం నిలుపు జేస్తూ ఈ సమావేశం తీర్మానించింది. కాంగ్రెసును సమైక్యంగా ఉంచాలని మధ్యమ కక్షివారు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. దానిమీద రాజీనామా ఇచ్చినవారు: సి. రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, జమ్నలాల్ బజాజ్, వల్లభ్ భాయ్ పటేల్, బ్రజకిశోర్ ప్రసాద్, జి.బి.దేశ్ పాండే.