పుట:Naajeevitayatrat021599mbp.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కమిటీ ప్రెసిడెంటుగారికీ, జిల్లా కాంగ్రెసు అధ్యక్షులయిన ఉన్నవ లక్ష్మీనారాయణగారికీ, విచారణ సంఘం వచ్చిన సందర్భంలో, (వాలంటీర్ల చేత) ఊరేగింపులూ, సభలూ జరిపించరాదని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశాడు. మీ నోటీసును, పాటించమనీ, మా వాలంటీర్లు కార్యక్రమాలలో పాల్గొంటారనీ ఆ జిల్లా పోలీసు సూపరింటెండెంటుగారికి నేను సమాధానం ఇచ్చాను.

విచారణ సంఘంవారు వస్తూన్న రైలు రెండు గంటలాలస్యం అయింది. చాలామంది వాలంటీర్లు అరెస్టుకు సిద్ధంగా డ్యూటీమీదే ఉన్నారు. పోలీసు స్టేషను సమీపంలో వాలంటీరుగా ఉన్న డి.వి.రాజు తలమీద ఉన్న గాంధీ టోపీని పోలీసువారు బలవంతంగా ఊడలాగి, అతనిని అవమానించారు. పోలీసువారు, తాము జారీ చేసిన ఆర్డరును వాలంటీర్లు వ్యతిరేకించే లోపలే, ఏదోఒకరకంగా గిల్లికజ్జా తెచ్చి అశాంతిని కలుగ జేయాలని దృఢంగా సంకల్పించుకున్నారన్న సంగతి నిశ్చయం అయింది. నేను పోలీసు సూపరింటెండెంటుకు ఇచ్చిన సమాధానాన్ని పురస్కరించుకుని, ముందుగా నన్నూ, లక్ష్మీనారాయణగారినీ పోలీసువారు అరెస్టు చేయవలసి ఉంది. కాని మమ్మల్ని ఇద్దరినీ వదలి, బాచీల వారీగా వాలంటీర్లని అరెస్టు చేయడం ఆరంభించారు. ఆ ప్రకారంగా ఆ రైలు వచ్చేలోపల మూడువందల మంది వాలంటీర్లు అరెస్టయ్యారు.

ఈ వాలంటీర్లను అరెస్టుచేసి తీసుకు వెడుతూన్న సందర్భంలో నేను అక్కడే ఉన్నాను. ఉన్నవ లక్ష్మీనారాయణగారు, తాను అరెస్ట్ అవ్వాలనే తహతహ కనబరుస్తున్నా, పోలీసువారు అయన జోలికి పోవడము లేదు. అరెస్టు చేయబడిన ఒక వాలంటీర్ల బాచిని ఒక గుండ్రని గుంపుగా నిలబెట్టి, కొందరు పోలీసులను ఆ గుంపుకు కాపలాగా నియమించారు. లక్ష్మీనారాయణగారు, ఆ గుంపు చుట్టూరా రెండు మూడుసార్లు తిరిగి, తనను నిర్భంధిచడానికి పోలీసులు విముఖంగా ఉన్నారని గ్రహించి, బలవంతంగా ఆ వాలంటీర్ల గుంపులోనికి ప్రవేశించి, అరెస్టయిన వారిలో తాను కలిసిపోయాడు. ఏ విధమయిన అలజడీ లేకుం