పుట:Naajeevitayatrat021599mbp.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లిస్తూ ఉంటే, చాలాచోట్ల ప్రజలు, ఏ పార్టీకి విరాళలిస్తే దేశానికి క్షేమం కలుగుతుందో నిర్ణయించుకోలేక, తాము యివ్వదలచిన విరాళాన్ని ఆ రెండు పార్టీలవారికీ సమంగా పంచి యిచ్చేవారు.

సహకార నిరాకరణ విధానం దేశానికి ఎంతవరకూ ఉపకరించింది అన్న విషయాన్ని తేల్చడానికి నియోగింపబడిన "శాసనోల్లంఘన ఉధ్యమ విచారణ సంఘం" సత్యాగ్రహ విధానాన్ని విరమింపజేయడానికే ప్రాతిపదికగా ఏర్పాటయిందన్న నమ్మకం జనంలో బాగా నాటుకు పోయింది. ఆ సంఘ సభ్యుడుగా తనను కూడా ఎన్నుకున్నారని, రాజగోపాలాచారిగారు చాలా సంతోషించారు. సహాయ నిరాకరణ విధానానికి స్వస్తిచెప్పాలనే ఉద్దేశాన్ని కడుపులో పెట్టుకునే, రాష్ట్రాలవారిగా, ప్రజాభిప్రాయ సేకరణ కంటూ, ప్రయాణాలు సాగించారు. దాస్-మోతిలాల్ గారలు తమ పన్నుగడ మనస్సులో పెట్టుకునే, కార్యక్రమం సాగిస్తున్నారన్న సంగతి నేను గ్రహించాను. ఈ విషయంలో ప్రజాభిప్రాయం అవిచ్ఛిన్నంగానూ, ఏకగ్రీవంగానే ఉంది; వచ్చిన చిక్కల్లా నాయకుల మధ్య ఏర్పడిన స్వల్పమైన తగాదాలేనన్న విషయాన్ని రుజువు చెయ్యాలనే తలంపు నాకు గట్టిగా కలిగింది.

గుంటూరులో దర్యాప్తు

ఆ సంఘంవారు, విచారణ నిమిత్తం ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంలో, నాకు ఒక అవకాశాన్ని కల్పించారు. [1] గత సంవత్సరమే పన్నుల నిరాకరణ ఉధ్యమాన్ని ముమ్మరంగా సాగించ గలిగిన ఆ గుంటూరు గ్రామాన్నే ఆంధ్రదేశ కేంద్రంగా భావించి విచారణ జరిపిస్తాం అన్నారు. నిజానికి, గాంధీగారు బైట ఉన్నప్పటి కంటే, నిర్భంధింపబడిన తర్వాతనే దేశంలో అలజడీ, ఉత్సాహమూ, ఎక్కువయ్యాయన్న సంగతి అక్కడ రుజువయింది.

గుంటూరుజిల్లా పోలీసు సూపరింటెండెంటు ప్రదేశ కాంగ్రెసు

  1. అప్పుడు పంతులుగారే ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘానికి అధ్యక్షులు.