Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడుతూ ఉండేవి. జీవితావసరాలు కలిసి పంచుకుని అనుభవించే లక్షణం ఒక పవిత్రతగా భావింపబడేది. ఈనాడు మన కళ్ళఎదట కనబడే స్వార్థం ఆ రోజుల్లో అంతగా కనబడేది కాదు. సుమారు అర్ధశతాబ్దం పైనాటి ఆ రోజుల సంగతి తలుచుకుంటే, నాకు, అది అంతా ఒక స్వప్నంలో తోస్తుంది.

మనుష్యుల్లో ఉండే ప్రేమాతిశయాలు గంభీరంగా కనపడేవి. ఆనాడు మనుష్యులికి కావలసిన వస్తువిశేషాలు కూడా బహు స్వల్పమే. మా తండ్రులందరూ దేశంలో తయారైన నూలులో అక్కడి సాలెవాళ్ళు తయారుచేసిన బట్టలే కట్టుకునే వారు. 1702 వగైరా మల్లుల భ్రమలు అప్పటికి లేనేలేవు. నే నయితే స్వయంగా ఎరగను కాని, మా అమ్మగారు చెప్పిన దానిని బట్టి చూస్తే మా యిళ్ళలో కదురు కవ్వాలు ఆడడం వల్లనే లేమి అనేది లేకుండా ఉండింది. ఈనాడు మట్టి పాత్రలంటే ఐశ్వర్యవంతులం అనుకునేవాళ్ళు న్యూనతగా చూస్తారు. ఆ కాలంలో గౌరవకుటుంబాల లెఖ్ఖలో ఉన్న మా యిళ్ళల్లో కూడా మట్టిపాత్రల్లోనే వంటకాలు జరిగేవి. ఆనాటి జీవితంలో విశేషం ఏమిటంటే, నాణెం ఎంత సకృత్తుగా కనిపించినా జీవితావసరాలు, మర్యాదలు ఎంతమాత్రం లోపించేవి కావు. కుటుంబం ఎంత పెద్దదైనా పండుగలు, పబ్బాలు వచ్చినపుడు కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అంతా కలిసి వేడుకలు చేసుకోవడమూ, అంతా సాలెవాళ్ళు తయారు చేసి యిచ్చిన నూతన వస్త్రాలు ధరించడమూ, 'ఇది లోటు' అనే మాట లేకుండా తృప్తిపడడమూ ఉండేది. ఇందలో బంధుమర్యాదలూ, స్నేహ మర్యాదలు కూడా లోట్లు లేకుండా జరుగుతూ ఉండేవి. ఈనాటి పద్ధతులతో పోల్చి చూసుకుంటే ఆ రోజుల్లో జీవితమే పరిపూర్ణమైనదనీ, సుఖప్రజమైనదనీ తోచక తప్పదు. గతించిన రోజులన్నీ మంచివిగానే తలవడం లోకంలో ఉన్నదే. అందులోనూ ఆ రోజుల సంగతి తలుచుకుంటే "సత్యయుగం అంటే అదేనా?" అనిపిస్తుంది.

ఇంతటితో మా పూర్వులగాథ విరమించి స్వీయ గాథకి వద్దాము. నేను పుట్టిన తేదీ నాకు సరిగ్గా తెలియదు. నా దగ్గిర ఎక్కడా