Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరచే లాగున ప్రబోదం చేస్తామనీ వ్యక్తం చేశారు.[1]

గయా కాంగ్రెసు ముగిశాక 1-1-1923 న జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో ఏప్రిల్ 30 వ తేదీనాటికి 25 లక్షల రూపాయలు విరాళాలుగా ప్రోగుజేసి, గాంధీగారు జైలులో ఉన్నంతకాలం, యాబైవేల స్వచ్చంద సేవకులద్వారా, ఆయన విధానానుసారం సహకార నిరాకరణ ఉధ్యమ ప్రచారం ముమ్మరంగా సాగించడానికి నిశ్చయించుకున్నాము. ఈ సహకార నిరాకరణ ఉద్యమం సవ్యంగా సాగించడానికి కార్యనిర్వాహకవర్గం వారికి అధికారం కూడా ఇవ్వబడింది.[2] గయా కాంగ్రెసువారి తీర్మానాలకు అనుగుణంగా ముమ్మరంగా ప్రచారం చేయడానికి నిశ్చయించుకుని, రంగంలోకి దిగడానికి సిద్దం అవుతున్నాం.

తిరిగిపోయిన అచారిగారు

ఆ సమయంలో రాజగోపాలాచారిగారు తమ మనోదౌర్సల్యం కారణంగా మారిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ మరుసటి నెలలోనే ఆయన పదకంలో మార్పు వస్తుందని అనుకోలేదు. ఎప్పుడు, ఏ విధంగా రాజగోపాలాచారిగారికి, దాస్-మోతిలాల్‌గార్లు రాజీ ప్రతిపాదనలు అందజేశారో నాకెంత మాత్రమూ తెలియదు. నేనూ, దాసూ ఎప్పుడూ చాలా సన్నిహితంగానే ఉండేవారము. రాజకీయ విధానాలలో మాకు భేదాబిప్రాయాలున్నా, మాలో మేము ఎప్పుడూ హృదయాలు విప్పే మాట్లాడుకునేవారం. తాము రాజగోపాలాచారిగారికి అందించిన రాజీ ప్రతిపాదనలను గురించి దాస్‌గారు నాతో ఎప్పుడూ చెప్పలేదు.

  1. సి.ఆర్.దాస్ తన అధ్యక్షోపన్యాసంతో పాటు స్వరాజ్యపార్టీ నిబంధనావళిని, తన రాజీనామానూ కూడా తయారు చేసుకునే మహాసభకు వచ్చారుట. ఈ విధంగా కాంగ్రెసులో "స్వరాజ్య" కక్షి ఏర్పడింది.
  2. అధ్యక్షులు సి.ఆర్.దాస్ తన రాజీనామా పత్రం సమావేశం ముందు పెట్టారు. ఆ విషయం ఫిబ్రవరి సమావేశానికి వాయిదా వెయ్యడం జరిగింది.