Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లనూ బాగా ఎరిగి ఉన్నవాడు. బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సామరస్యం చెడి, వారి మథ్య రాజుకుని ప్రజ్వరిల్లుతున్న భేద భావాభావాలనీ, వారి మధ్యనున్న అగాధాన్నీ అంతమొందించడానికి సులభోపాయంగా, బ్రాహ్మణేతరు లందరిచేత యజ్నోపవీతధారణ చేయించి, వారినీ బ్రాహ్మణులగానూ, వారితో సమానస్థాయిని అనుభవించే వారినిగానూ మారుస్తానని, వారి కందరికీ వలసిన జ్ఞానబోధచేసి బ్రాహ్మణత్వం ఇస్తాననీ ఒక క్రొత్త పథకాన్ని ప్రచారంలోనికి తీసుకువచ్చాడు. ఆయన కొంతకాలం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసాడు. ఆ హోదాలో భారత దేశమంతటా తిరిగే రోజులలో క్షయ రోగానికి గురి అయి, చాలా చిన్న వయస్సులోనే పరమపదించాడు.

అపూర్వ దృశ్యం

చీరాల-పేరాల ఉదంతం ఆప్రాంతానికే చెందిన సమస్యే అయినా, దాని చండ ప్రభావంవల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందడంచేత, అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది.

ఆ పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్ళాను. అచ్చట ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు జనమూ బీదాసాదా, ముసలీ ముక్కీ, బ్రాహ్మణ అబ్రహ్మాణాది విభేదాలు యీషణ్మాత్రమూ లేకుండా ఏకగ్రీవంగా, ఆ గ్రామాన్ని వదలి ఇతర ప్రాంతలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆనందంగా బయల్దేరారు. బీదవారు తమకు చెందిన తట్టాబుట్టా తమ నెత్తిమీద పెట్టుకుని స్వయంగా మోస్తున్నారు. ఇంతకంటె ఆశ్చర్యకరమైన సంఘటన ఉంటుందా?

జస్టిస్ పార్టీవారి "జస్టిస్"

పదిహేడువేల ప్రజ, ఒక్కుమ్మడిగా, ఒక మాటగా కోరిన కోరికను న్యాయానికి పానుగలు మంత్రివర్గంవారు మన్నించి, వారిని ఇటువంటి ఇక్కట్లు పాలుగాకుండా చూచి ఉండవలసింది. కాని జస్టిస్