ప్రక్క మాప్లాలూ, రెండవ ప్రక్క పోలీసు మిలిటరీ అధికారులు కలుగిస్తూన్న భయోత్పాతం గురించి వివరించాడు. అసలు విప్లవం అతి స్వల్పకారణం మీదనే ఆరంభం అయిందనీ, ఆరంభంలో అంత ఉద్రుతంగా లేకపోయినా, వారం రోజులలోపలే మాప్లాలు అటు ఇంగ్లీషువారినీ, ఇటు కాంగ్రెసు వారినీ కూడా తమ శత్రువులుగా బావింపడంతో విప్లవం తారాస్థాయిని అందుకుందనీ తెలియవచ్చింది.
అప్పటివరకూ అతికష్టంమీద నిర్మాణమయిన హిందూ-మహమ్మదీయ సమైక్య సౌధం తునాతునకలయింది. మాప్లాలు ఇంగ్లీషు వారినీ, హిందువులనూ హింసించి తీరాలనే దృఢసంకల్పంతో ఉన్నారు. ఆ ప్రాంతం అంతటా మార్షల్ లా అమలు పరచబడింది. వెనువెంటనే విచారణ జరపడానికి గాను మిలిటరీ కోర్టులు తెరవబడ్డాయి. సాధారణంగా మరణ శిక్షే విధించేవారు.
అలీ ముసలియార్ అనే ఒక మాప్లానాయకుడు తన స్వతంత్ర పతాకం ఎగుర వేశాడు. ఒక వారం రోజులపాటు సివిలు, క్రిమినలు వ్యవహారులలో సర్వస్వతంత్రంగా వ్యవహరించాడు, ఆయన కూడా మరణ శిక్షలూ, ఆస్తి జప్తులూ విధించేవాడు.
మార్షల్ లా ప్రకటింపబడి నప్పటికీ, బ్రిటీషు ఆఫీసర్లూ, వారి కుటుంబాలూ ఏ క్షణాన ఎటువంటి ఇక్కట్లకు లోనవుతామోననే భీతితోనే ప్రాణాలు బిగపట్టుకుని క్షణాలను యుగాలుగా గడిసే పరిస్థితిలో ఉన్నారు. ఇంగ్లీషువారు ఏ మాప్లా అయినా ఎదురయితే వెంటనే వాని కుత్తుక కత్తరించి చంపేసేవారు.
ఒకొక్కప్పుడు మాప్లా యువకులు జరిపిన చర్యలు చాలా ఘోరంగానూ, అమానుషంగానూ ఉండేవి. ఒక చిన్న మాప్లా కుర్రవాడు చేతిలో కత్తిపట్టుకుని నడుస్తూ ఉన్న బస్సులోకి ఉరికి ఒక ప్రయాణీకుణ్ణి అప్పటి కప్పుడు చంపివేశాడు. డ్యూటీలో ఉన్న మిలిటరీ ఆఫీసరు జాక్సన్‌ని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. అడ్వకేట్ అయిన యం.పి. నారాయణమేనోన్, దెబ్బలాట ముమ్మరంగా సాగుతూన్న ఒక సందర్భంలో, అమాయిక ప్రజల్ని రక్షించాలని చేసిన