దగ్గరనుంచీ, కుమారుని వద్దనుంచీ కూడా మూడు టెలిగ్రాములు వచ్చాయి. కాని ఇంకా కొంతకాలం నాతో ఉండి, పరస్పరం సహకరించుకుందామనే అభిప్రాయం వెంకట్రామయ్యరు వెళ్ళడించాడు.
తిరుగుబాటు పరిస్థినీ, మిలిటరీ చర్యలనూ బాగా ఆకళించుకుని ఉన్న ఆ ప్రాంతీయులు, మోటార్లు మున్నగునవి యేవీ రోడ్లమీద నడవడానికి వీలుకాని పరిస్థితిని కలుగజేయడానికి అవలంబించిన విధానాన్ని గ్రహించి, మేము ఒట్ట పాలియంనుంచి కాలికట్టుకు కాలినడకనే జేరాలని నిశ్చయించుకున్నాము. ఆ రోడ్డుదారిని కాలికట్టూ, ఒట్టపాలియం గ్రామాల మధ్య దూరం అరవై మైళ్లు.
మేము ఉభయులమూ మరుసటి ఉదయాన్నే బయల్దేరాము. మాకు అచ్చటి విషమ పరిస్థితులు తెలియవు. కాలి నడకనే ఆ అరవది మైళ్ళు ప్రయాణం చెయాలంటే కలిగే ఇబ్బందులూ, ఆటంకా లేవీ మాకు తెలియవు.
అల్లా బయల్దేరి ఒక అయిదు మైళ్ళు వెళ్ళేసరికి మాకు ఆ దారిని నడచి వెళ్ళడంలో ఎంత కష్టమున్నదో బోధపడింది. మాప్లాలలో చాలమంది మిలిటరీలో పనిచేసి రిటైరయినవా రున్నారు. వారు లోగడ యుద్ధాలలో విదేశాలలో కూడా పనిచేసి ఉండడంవల్ల వారికి మిలిటరీ విధానాలు కొన్ని తెలుసు. అందువల్ల వారు మున్ముందుగా రోడ్డు కిరుప్రక్కలా వుండే బాగా ఎదిగిన చెట్లనన్నింటినీ నరికి, వాటిని దారికి అడ్డంగా, అడ్డదిడ్డంగా పడేశారు. ఆ అరవై మైళ్ళ పొడుగునా చెట్లన్ని నరకబడి దారికి అల్లా అడ్డంగా పడవేయబడే ఉన్నాయి. ఆ దార్లన్నీ యే విధమయిన బళ్ళూ నడవడానికి వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. అట్టి పరిస్థితులలో సాయంత్రం దాకా నడచినా ఇరవై మైళ్ళయినా వెళ్ళలేకపోయాం
చెర్పల్ చేరీలో
మేము "చెర్పల్‌చేరీ" గ్రామం చేరేసరికి సూర్యాస్తమయం అయింది. ఉభయులమూ ఖద్దరు దుస్తులలోనే ఉన్నాము. దారిలో తటస్థ పడిన వారందరూ మమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆ రాత్రికి అక్కడే