Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ట్రామయ్యరూ, నేనూ తిన్నగా తంజావూరువెళ్ళి, యాకుబ్ హుస్సేన్‌ని కలుసుకొని, మలబారులో ప్రారంభం అయిన మాప్లా తిరుగుబాటును గురించి చర్చించాము. వారూ మాతోబాటు ఉంటే మంచిదని సూచించాము. తాను యీ కాంగ్రెస్ సమావేశంలో ఇరుక్కున్న కారణంగా మాతో కలిసి ఆ ప్రాంతాలకు రాలేననీ, మమ్మల్నిద్దరనీ తప్పకుండా వెళ్ళి సంగతి సందర్భాలు గమనించమని ఆయన ప్రోత్సహించారు.

సైనిక శాసనం

మా కెవ్వరికీ మలబారులో ఉన్న పరిస్థితులుగాని, మార్షల్ లా అమలు పరచబడిన ప్రాంతం ఎల్లా ఉంటుందనిగాని యేమాత్రమూ తెలియదు. సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతం ఎల్లా వుంటుందో ఊహించడానికయినా నాకు పూర్వానుభవం ఏమీలేదు. తంజావూరు నుండి తిన్నగా కాలికట్టుకు టిక్కట్లు తీసుకున్నాము. షోరనూరు చేరే వరకూ మాకు ఏ విధమయిన అడ్డంకులూ లేకుండా ప్రయాణం చాలా సాఫీగానే సాగింది. మేము కాంగ్రెసుకు సంబంధించిన వ్యక్తులమన్న కారణంగా ఆ ప్రాంతంలలో అడుగు పెట్టడానికి వీలులేదనీ, వెంటనే వెనక్కు వెళ్ళమనీ మమ్మల్ని ఒక మిలిటరీ అధికారి ఆజ్ఞాపించాడు. మా కష్టాలకు ఆ ఆజ్ఞ నాంది అయిందన్నమాట.

షోరనూరు స్టేషనులోని మొదటి తరగతి విశ్రాంతి గదిలో కూడా మమ్మల్ని కూర్చోనివ్వలేదు. మిత్రులు కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మేము స్టేషన్ ఆవరణ దాటి ఊళ్ళో ఉన్న ఒక ధర్మశాలలో ప్రవేశించాము. ఆ రాత్రికి అక్కడ ఉండి, పరిస్థితులు గమనించి, అవలంబించ వలసిన విధానం నిర్ణయించుకోవాలని మాకోరిక. కాని మిలిటరీ అధికారులు మమ్మల్ని వెన్నంటే ఉన్నారు. మేమొక సత్రంలో మకాం చేశామన్న సంగతి గ్రహించి, వారు ఆ సత్రం అధికార్ల దగ్గరకు వెళ్ళి, ఆ సత్రపు పరిసరాలలో కూడా మేము ఉండటానికి వీలులేదనీ, వెంటనే ఖాళీచేసి బయటికి వెళ్ళిపోవాలనీ మాకు నోటీసు ఇవ్వవలసిందిగా వారికి ఆజ్ఞాపించారు. ఆ వూళ్ళో మాకు కావలసిన కాంగ్రెసు మిత్రులూ, అభిమానులూ ఉన్నా, మార్షల్ లా పేరుమీద