పుట:Naajeevitayatrat021599mbp.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాని ఆ సమావేశాలలో వందలూ వేలుగా మాప్లాలు పాల్గొనేవారని మాత్రం కచ్చితంగా చెప్పగలరు. ఆ రోజులలో కాంగ్రెసు-ఖిలాఫత్ ఉద్యమాల మూలంగా, దినదినాభివృద్ది గాంచుతూన్న హిందూ-మహమ్మదీయ సామరస్యం వలన అత్యల్పకాలంలోనే మనకు స్వరాజ్యం సిద్దిస్తుందని మాత్రం మనస్ఫూర్తిగానూ, త్రికరణ శుద్ధిగానూ నమ్మాను.

దక్షిణ హిందూ దేశానికి సంబంధించి నంతవరకూ మలబారే ముఖ్యమయిన మహమ్మదీయ కేంద్రం. అక్కడ అతి విస్తారంగా మహమ్మదీయులున్నారు. హిందూ-మహమ్మదీయ సామరస్య సాధన కృషికి 1921-22 లో ఉత్తర హిందూస్థానంలో గట్టి దెబ్బ తగలకుండా ఉండి ఉంటేనూ, 1917 లో మాంటేగారికి సమర్పించిన, కాంగ్రెస్-లీగ్ ప్రతిపాదనలతో మహమ్మదీయులు సంతుష్టి చెంది ఉంటేనూ, ఈ దేశం డొమినియన్ స్టేటస్‌గాని, పూర్ణస్వాతంత్ర్యాన్నిగాని యేనాడో పొంది ఉండేది. ఈ సందర్బంలో మలబారులో హిందూ-మహమ్మదీయ సామరస్య సాధన యత్నాలు ఏలా విచ్చిన్నం అయ్యాయో కాస్తంత విస్తరిస్తాను.

ప్రాణాలకు తెగించిన పర్యటన

మలయాళ దేశంతోటీ, దేశీయులతోటీ నాకు మొదటినుంచీ సన్నిహిత సంబంధం ఉండడంచేత, ఈ మాప్లా తిరుగుబాటుకు సంబంధించిన కారణాలన్నీ సమగ్రంగా పరిశీలించాలనే ఉద్దేశంతో నే నా ప్రాంతం అంతా ఆ రోజులలో పర్యటించి ఉన్నాను. ఆ పర్యటించిన ప్రాంతాలలో మిలిటరీ హయాంలో ఉన్న ప్రాంతం కూడా ఉంది. మాప్లా తిరుగుబాటు ఇంకా అప్పటికి ఆరంభ దశలోనే ఉంది. ఆరంభం అయిందనే తొలి వార్త అందగానే తిన్నగా కాలికట్ పట్టణానికి వెళ్ళాలనే ఉద్దేశం కలిగింది. "స్వరాజ్య" పత్రికా స్థాపనలో నాకు చాలా సన్నిహితుడుగా ఉన్న టి.వి.వెంకట్రామయ్యర్ నాతోపాటు యీ పర్యటనలో పాల్గొనడానికి నన్ను అనుసరించాడు. అప్పట్లో తంజావూరులో మౌలానా యాకుబ్ హుస్సేన్‌గారి ఆధిపత్యాన, తమిళనాడు ప్రాంతానికి చెందిన రాష్ట్రీయ కాంగ్రెసు సమావేశం జరుగుతోంది. వెంక