పుట:Naajeevitayatrat021599mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారు. వాళ్ళు పెద్దవాళ్లై ప్రయోజకులైన తరువాత, ఆయన ఆ భవంతి కెదురుగా ఉండే ఒక పూరింట్లో కాపరం ఉంచేవారు. నేనైతే ఆయన్ని ఎరగను. మా నాయనమ్మ సావిత్రమ్మగారినీ, ఆవిడ చెల్లెలు ఆదెమ్మగారినీ ఎరుగుదును. మా తాతగారినిగురించి నే నెరిగినదల్లా ఆయన తాలూకు పాత రికార్డులు. మేదరతడకలతో పంజరం కట్టి, దానిపైన తోలుతో బిగించిన పెద్ద కావిడిపెట్టెలవంటి పెట్టెల్లో ఆ రికార్డు లన్నీ ఉండేవి. మా అవ్వ లిద్దరూ పాడి సమృద్ధిగా చేస్తూ ఉండేవారు. మా తాతగారు 85 సంవత్సరాలు పైగా సంపూర్ణమైన జీవితం గడిపి కీర్తిశేషు లయ్యారు.

మా తాత గారికి మా తండ్రులు నలుగురు. వారి నలుగురిని నేను కొంచెం ఎరుగుదును. మా పెత్తండ్రిగారైన రాఘవయ్యగారు కొంత కాలానికి భార్యాపుత్రులతో సహా కుటుంబంతో సంబంధం ఒదులుకుని తిరుపతి వెళ్ళిపోయారు. రెండో ఆయన రామస్వామిగారు. ఆయన సంగీత సాహిత్యాల్లో మంచి ప్రవేశం కలవారు. తరుచుగా పొగాకుతో తమలపాకులు నములుతూ సంగీతసాధన చేస్తూ ఉండేవారు. మూడో ఆయన అప్పాస్వామి. ఆయన తాతగారి తాలుకు కరిణీకం చేపట్టి గ్రామ పాలకత్వం సాగిస్తూ ఉండేవారు. మా తండ్రిగారైన గోపాల కృష్ణయ్యగారు వ్యవసాయంపని చూస్తూ ఉండేవారు. మా తాతగారి మరణానంతరం మా తండ్రులు నలుగురూ ఇల్లూ, ఆస్తీ పంచుకుని వ్యష్టిగా అనుభవిస్తూ కార్యకలాపాలు వచ్చినప్పుడు సమిష్టిగా వ్యవహరిస్తూ ఉండేవారు.

అంతకు పూర్వపు సంగతులు నాకు అంతగా తెలియవుగాని, మా మేనత్తలిద్దరిలో పెద్దామె పార్వతమ్మగారు చిన్నతనంలో వైధవ్యం పొంది, ఇంట్లోనే ఉండి మా కందరికీ కంటికి రెప్పలా ఉండేది. ఆమె చెప్పిన విషయాలవల్లనే నాకు మా పూర్వుల విషయం తెలిసింది. ఆ కాలంలో పండగలూ, పర్వాలూ వచ్చినప్పుడు మా అమ్మగారూ, మా పెత్తల్లులూ, అంతా కలిసి పండుగలు చేసుకుంటూ, వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా పని అవసరం అయిన