పుట:Naajeevitayatrat021599mbp.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిక్షను లేదంటూ వాదించిన నా విధానమూ, తన్ను తాను డిపెండ్ చేసుకుంటూ క్రింది కోర్టులో సుబ్బరామయ్య తీసుకువచ్చిన తికమకలూ, హైకోర్టులో తీసుకురాబడ్డ అబద్ధపు అడ్డంకులూ, మున్నగువన్నీ హిచ్‌కాక్‌కు బాగా అవగాహన అయిఉండాలి. క్రిందికోర్టులోనూ, హైకోర్టులోనూ తన పక్షాన్నే ఇవ్వబడిన తీర్పూ, నాజ్యూరిస్ డీక్షన్ అభ్యంతరమూ గమనించకుండా, నాపైన డిక్రి అమలుపరచడానికి హిచ్‌కాక్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. డిక్రీ హోల్డరు తన చేతులతోనే డిక్రీని చంపుకున్నాడన్నమాట. సుబ్బరామయ్యమీద డిక్రీ అమలు జరిగిందో లేదో, దాని గతి యేమయిందో తెలుసుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. ఏదో అయిఉంటుంది, ఏమయితే మన కెందుకు అనే భావమే ఆ డిక్రీ విషయంలో నాకు కలిగింది. ఏది ఏమయినా జీవితంలో ఇది ఒక మంచి అనుభవం

సహాయనిరాకరణ ఉధ్యమ ప్రారంభదశలో గాంధీగా రిచ్చిన ఒక ఉపన్యాసంలో, పై ఉదంతాన్ని పేర్కొంటూ, అ సందర్భంలో ఆయన, నాకు, సలహారూపంగా సివిలు కోర్టులలో పెట్ట తగ్గ వాదనావిధానాన్ని సూచించానని చెప్పారు. అంటే ఈ కోర్టులలో నాకు నమ్మకం లేదు. ఈ కేసు విచారించడానికి ఈ కోర్టువారికి హక్కు లేదు మున్నగు నినాదాలన్నమాట! ఆ సందర్భంలో ఆయన త్రివిధ బహిష్కరణ అంటే యేమిటో చెబుతూ, సహాయ నిరాకరణ వాదులపై ఏవేని కేసులు కోర్టులలో మోపబడినప్పుడు, కాంగ్రెసువారు అవలంబింప వలసిన విధానానికి ఉదాహరణగా, ఆనాటి కేసూ, తానిచ్చిన సలహా ఆ సందర్భంలో ఉటకించారన్నమాట! ఈ ఉదంతాన్ని గాంధీగారు తమ ఉపన్యాసంలో చెపుతూన్న సందర్భంలో నా ప్రక్కనే నిలిచిఉన్న వల్లభాయ్ పటేల్‌గారు, "ఏమిటి నిన్నుగురించి అంటున్నారు" అంటూ అతి మెల్లిగా, రహస్యంగా అడిగారు. ఇట్టి ఉదంతాల కారణంగానే గాంధీగారికి సన్నిహితుడ నవడమూ, 1922 లో ఆయన అరెస్టయి నిర్బంధింపబడే వరకూ ఆయన్ని వెన్నంటి ఉండడమూ సంభవించాయి.