Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

మాప్లా తిరుగుబాటు:నా రిపోర్టు

మలబారుకు సంబంధించిన ఇంకో ముఖ్యమయిన ఉదంతం 1921 నాటి మాప్లా తిరుగుబాటు. ఒట్ట పాలియం సమావేశ సందర్భంలో హిచ్‌కాక్‌ను గురించీ, ఆయన విధానాలను గురించీ ఉద్ఘాటించి ఉన్నాను. నిజానికి ఒట్టపాలియం సమావేశం జరిగిన రోజులలోనే మాప్లా తిరుగుబాటు జరిగి ఉండవలసింది. కాని అప్పట్లో మేమందరమూ కలిసి కట్టుగా అవలంబించిన పద్దతులూ, తీసుకున్న అవశ్యక చర్యలూ, జాగ్రత్తలూ మున్నగునవన్నీ ఆనాటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడ్డాయి. అ కారణంచేత అప్పట్లో ఏవిధమయిన అల్లర్లూ ఉత్పన్నం కాకుండా చూడగలిగాము.

కొంతకాలం తర్వాత కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ ప్రచారాలు ముమ్మరమయి హిందువుల, మహమ్మదీయుల దృష్టిని ఆకట్టే సమయంలో, ఎల్లాగయినా ఈ ఉద్యమాలను త్రోసి రాజనాలనే ఉద్దేశం హిచ్ కాక్ బుర్రలో ప్రవేశించింది. ఈ ఆలోచనలో హిచ్ కాక్ తీసుకున్న ప్రప్రథమ సత్వర చర్య 144 వ సెక్షను ప్రకారం ఆంక్షలు విధించడం. కీర్తిశేషులయిన మౌలానా యాకుబ్ హుస్సేన్, కె.మాధవన్‌నాయర్ల కూ, ఇంకొక ప్రఖ్యాత న్యాయవాది గోపాలన్ మేనోన్‌కూ, మొహిద్దీన్ కోయాకు ఆ 144 వ సెక్షన్ కింద విధింపబడ్డ ఆంక్ష ప్రకారం, వారు మలయాళ దేశమందలి ఇతర ప్రాంతాలకు వెళ్ళరాదంటూ ఆర్డర్లు జారీచేశాడు. వారు నలుగురూ కూడా ఆ ఆంక్షను ఉల్లంఘించి, తలో ఆరుమాసాల జైలు శిక్షకు లోనవడమూ జరిగింది. ఈ నిర్బంధాలూ, శిక్షలూ అన్నవి మలబారులోని కాంగ్రెస్ ఉద్యమానికి దోహదాన్ని ఇచ్చాయి.

నాకూ, మలబారుకూ ఉన్న సంబంధాలు కాలం గడచిన కొద్దీ ఇంకా ఇంకా సన్నిహితం అయ్యాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ 1921-22 సంవత్సరాలలో నేను మలబారులో ఏ ఏతావులలో, ఏయే సభలలో పాల్గొని ఉపన్యసించానో చెప్పడం దుర్లభమే,