Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోర్టుల విషయంలో గాంధీగారి సలహా

నేను వ్రాసిన స్టేటుమెంటు చాలా చిన్నదే. అందులో చట్ట బద్ధ మయిన మెలికలున్నాయి (Legal Pleas). నేను వ్రాసిన డ్రాఫ్ట్ మేద గాంధీగారు రెండు అడ్డ గీతలుగీసి "ఇది చట్టాన్ని అనుసరించి తీసుకో దలచిన రక్షణ చర్య. ఇటువంటి రక్షణ చర్యలకు నేను అంగీకరించను. ఆ కోర్టువారికి యీ కేసు విచారణ చెయ్యడానికి హక్కు ఉందో లేదో మాత్రమే చూచుకోండి" అంటూ వ్రాసి నా కాగితాలు నాకు త్రిప్పి పంపించి వేశారు. నాగపూర్ కాంగ్రెసులో నిర్ణయించుకున్న త్రివిధ బహిష్కరణ కార్యక్రమానికి అనుగుణంగానే, గాంధీగారు నా కాగితం మీద వ్రాసిన సూచన ఉంది. ఈ విషయం మొదట్లో నాకు గుర్తుకు రాలేదు. నిజానికి గాంధీగారే కదా కాంగ్రెసుకు కర్త, భర్త అన్నీను. అందుకనే ఆయన అభిప్రాయాన్ని కోరుతూ నా కాగితాలు ఆయనకు పంపించాను. గాంధీగారి అభిప్రాయంతో నేనూ ఏకీభవించాను. "నాకు సంబందించినవరకూ ఈ కేసు విచారణ చెయ్యడానికి మీకు అధికారం లే" దంటూ వ్రాయబడిన స్టేట్‌మెంట్ మాత్రమే నేను దాఖలు చేశాను. రెండవ ప్రతివాది అయిన ఎల్.ఐ.సుబ్బరామయ్య కాంగ్రెసు సభ్యుడు కాదు గదా! తాను కాంగ్రెసు నియమావళికి బద్దుడను అంటూ ఎప్పుడూ యే విధంగానూ కాంగ్రెసులో జేరని వ్యక్తి ఆయన. అందువలన లా పాయింట్లు ఆధారంగా, దావా చెల్లదంటూ ఆయన వాదన తీసుకువచ్చాడు. సుబ్బరామయ్యగారి వాదన కారణంగా ఆయనకు సంబంధించి నంతవరకూ దావా విచారణ జరిగింది. హిచ్‌కాక్ కు అనుకూలంగా దావా డిక్రీ అయింది.

ఇరుకున పెట్టిన సుబ్బరామయ్య అప్పీలు

క్రింది కోర్టువారి తీర్పు న్యాయమయినదీ, చట్టబద్దమయినదీ కాదంటూ సుబ్బరామయ్యగారు హైకోర్టులో అప్పీలు చేశారు. నాప్రాక్టీసు ముమ్మరంగా సాగే రోజులలో నా సహచరుడుగా ఉంటూ ఉండే కీ.శే.టి.ఆర్.రామచంద్రయ్యరు, సుబ్బరామయ్యగారి ప్లీడరు.