పుట:Naajeevitayatrat021599mbp.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా మీద హిచ్‌కాక్ దావా

సమావేశం పూర్తి కాగానే విచారణ ప్రారంభించాం. ఒట్ట పాలియం వదిలే లోపల సేకరించగల సాక్ష్యాన్నంతా పూర్తిగా రికార్డు చేశాము. విచారణ అనంతరం రిపోర్టు వ్రాశాము. ఆ జిల్లాలో డి.యస్.పి.గాపనిచేస్తూ ఉన్న హిచ్‌కాక్కే, ఆ రోజున కాంగ్రెసు వారిపై జరుపబడిన చర్యల కన్నింటికి పూర్తిగా బాధ్యుడనే నిర్ణయానికి వచ్చాము.

కమిటీ మెంబర్ల మందరమూ ఆ రిపోర్టుమీద సంతకాలు చేశాము. ప్రచురణార్థం దానిని చెన్నపట్న మందలి "హిందూ" పత్రిక వారికిచ్చాము. మా రిపోర్టూ, అందలి అంశాలూ దేశంలో బాగా అలజడిని కలుగజేశాయి. కాంగ్రెసువారిని కొట్టింది పోలీసులే. వారు అలా కొట్టడానికి పోలీసు డిస్ట్రిక్టు సూపరింటెండెంటు (D.S.P)గారి ప్రోద్బలమే కారణమనీ, ఆయన పరోక్ష చర్యల మూలంగానే యీ సంఘటనలూ, పోలీసు చర్యలూ జరిగాయని మా రిపోర్టులో ఉంది.

తర్వాత కొంతకాలానికి హిచ్‌కాక్ నాకూ, తదితర కమిటీ సభ్యులకూ, మారిపోర్టులో తనపై వ్రాసిన పరువు నష్టపు వాక్యాలు తొలగించవలసినదనీ, తొలగించని పక్షంలో పరువునష్టం దావా మాపై వేయబడునని ఇప్పించిన లాయరు నోటీసు మా కందింది. నోటీసు మాకందిన అనంతరమే మా రిపోర్టు కాపీ ఒక దానిని గాంధీగారికి పంపించడం జరిగింది. నోటీసు ప్రకారం మా పై తీసుకొనదలచిన చర్యకు ఎదురు చూస్తున్నామని నేను వారికి జవాబు వ్రాశాను. సత్య గోవుల లాంటి కాంగ్రెసు వారిని తన ప్రోత్సాహంతో పోలీసువారు కొట్టారంటూ మా రిపోర్టులో వ్రాసి, తనపై అనవసరంగా నిందమోపి తనకు పరువు నష్టం కలుగజేసిన కారణంగా, మేము పరువు నష్టం క్రింద ముప్పదివేల రూపాయలు యివ్వవలసి ఉంటుందని, కాలికట్ సబ్ కోర్టులో హిచ్‌కాక్ మాపై దావా వేశాడు. చట్ట రీత్యా తన దావా చెల్లదంటూ నేను వ్రాసిన లిఖిత వాజ్మూలాన్ని పరిశీలనార్థం గాంధీగారికి పంపించాను.