పుట:Naajeevitayatrat021599mbp.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చి సంగతి సందర్భాలు విన్నవించుకున్నారు. కాన్ఫరెన్సు జరుగు తూండగా రిపోర్టయిన యీ సంఘటనలు సమావేశంలో పాల్గొంటూ వున్న చాలమంది స్త్రీ పురుషులకు ఉద్రేకపరచాయి. ఆనాటి సాయంత్రం మా సమావేశం ముగుసే లోపల ఎల్లాగయినా అల్లరిపెట్టి, ఆఖరు నిమిషంలోనయినా సమావేశం గల్లంతు కలుగజేసి సాగకుండా చెయ్యాలన్న పోలీసువారి కుతంత్రమే ఈ సంఘటనల కన్నింటికి కారణమన్నది అందరికి అర్థమయిపోయింది.

ఊరేగింపు నాయకత్వం

వేరే ఇంకో సభకు అధ్యక్షత వహించిన మిత్రుడు జార్జ్ జోసఫ్, ఆ సభ ముగించుకునివచ్చి, ఇక్కడ సమావేశమయిన స్త్రీ పురుషుల నందరినీ చిన్న చిన్న జట్లుగా దొడ్డి గుమ్మం ద్వారా బయటికి పంపడం మంచిదని నాతో అన్నాడు. నేనా అభిప్రాయాన్ని ఎగతాళి చేశాను. సమావేశం సాంతం అయ్యేవరకూ సభ్యులను శాంతగానూ, నిశ్చలంగానూ కూర్చోవలసినదిగా కోరుతూ కొంత తడవు నేను ఉపన్యసించాను. అంతేకాదు. సమావేశానంతరం ఆయా సంఘటనలు జరిగిన ముఖ్యవీథులగుండా ఊరేగింపుగా సభలోని ప్రకుఖ నాయకులంతా వెళ్ళాలనీ సూచించాను. సభను శాంతంగా తుదివరకూ సాగించమనీ, అంతవరకూ ఎవ్వరూ కదల రాదనీ కోరాను.

సభానంతరం, నేను స్వయంగా ముందుండి నాయకత్వం వహిస్తూ, సభలోని ముఖ్యుల నందరినీ ఊరేగింపుగా ఒట్ట పాలియం ముఖ్యవీథులన్నింటిలోనూ నడిపించాను. ప్రజలలో నాటుకున్న విశ్వాసాన్నీ, ఆత్మశక్తినీ అణగద్రొక్కలేమని పోలీసువారు గ్రహించారు.

సమావేశం సాంతం అయ్యేలోపల పోలీసుల కారణంగా జరిగిన యీ అల్లరులను విచారించడానికిగాను ఒక ఉపసంఘాన్ని నియమించాము. ఆ ఉప సంఘానికి నేనే అధ్యక్షుణ్ణి. కొంతమంది ఇతర ప్రముఖులతోపాటు ఎల్.ఐ. సుబ్బరామయ్య అనే పాల్‌ఘాటు న్యాయవాది కూడా యీ ఉప సంఘ సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు.