1
పూర్వగాథ
మా ముత్తాతలనాడు స్వగ్రామం ప్రస్తుతం ఒంగోలు తాలూకా టంగుటూరు. మా ముత్తాత నరసరాజు గారు కరణీకం చేస్తూ మంచి ఆస్తిపాస్తులు సంపాదించారని వినికిడి. ఆయన కాలంలోనే మాకు టంగుటూరికి ఆరు మైళ్ళ దూరంలో వెంకటగిరి రాజాగారి ఎస్టేటులో ఉన్న వల్లూరు గ్రామంలో సుమారు 40, 50 ఎకరాల భూవసతి ఉండేది. వల్లూరు, టంగుటూరికీ ఒంగోలుకీ మధ్య మద్రాసు కలకత్తా ట్రంకురోడ్డు మీద ఉన్న గ్రామం.
నరసరాజుగారి కాలంలో ఆయనకి వెంకటగిరి సంస్థానంలోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ విశేషం పలుకుబడి ఉండేది. వారు పేరు ప్రఖ్యాతులలో గౌరవంగా కాలక్షేపం చేసేవారు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అని ఇద్దరు కుమాళ్ళు ఉండేవారు. ఆ రోజుల్లో నియోగి కుటుంబాలు కరిణీకం వగైరాలతో లౌక్యజీవనం చేస్తూ గ్రామ పాలకత్వం వహిస్తూ ఉండేవి. అందుచేత మా ముత్తాతగారు, అప్పాస్వామి టంగుటూరులో కరిణీకం చేసుకుంటూ అక్కడే నివసించడానికీ, ఆయన తమ్ముడూ మా తాతగారూ అయిన నరసరాజు వల్లూరులో కాపరం చేస్తూ, కరిణీకమూ దానితోపాటు భూములు చూసుకుంటూ జీవయాత్ర చేయడానికిన్నీ నిర్ణయించారు. ఆ ప్రకారంగా మా తాతగారు వల్లూరు రావడం తటస్థించింది. అందుచేతనే టంగుటూరు ఇంటిపేరు అయినా మా గ్రామం వల్లూరే అని చెప్పవలసి వస్తుంది.
వల్లూరులో మా తాతగారు పెద్ద నాలుగిళ్ళ భవంతి ఒకటి కట్టారు. ఆయనకి నలుగురు కుమాళ్ళూ, ఇద్దరు కుమార్తెలు జన్మిం