పుట:Naajeevitayatrat021599mbp.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏవిధమైన పన్నులూ వసూలు చేయలేని స్థితికి వచ్చేసరికి పరిస్థితులు విషమించాయి. గుంటూరు నాయకులంతా బాపట్ల తాలూకా పెదనందిపాడు ఫిర్కాకు చెందిన సుమారు నూరు గ్రామాలలో ఈ పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరంగా సాగించే కృషిలో నిమగ్నులయ్యారు. గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాలకు చెందిన గ్రామోద్యోగులందరూ (మునసబు, కరణం, వెట్టివాళ్ళు వగైరా) రాజినామాలిచ్చి ఈ ఉధ్యమంలో సహకరించారు. ఉధ్యమం ఘనవిజయం సాధించింది. రివెన్యూ డిపార్టుమెంటు ఉద్యోగుల జీతాలకు సరిపడినంత ధనం కూడా పన్నుల రూపంగా వసూలు కాలేదు. కలక్టరుగారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.

ఇప్పుడు[1]ప్రభుత్వం వారికి సలహాదారుగా పనిచేస్తూన్న రూథర్‌ఫర్డ్ అప్పుడు స్పెషల్ డ్యూటీమీద, పన్నుల వసూలు నిమిత్తం ఆ జిల్లాకు ప్రత్యేకంగా పోస్టు అయ్యాడు. ఆయన చాలా ప్రతిభావంతుడే. అయితేనేం. పన్నుల వసూళ్ళ విషయంలో ఆయన చాకచక్యం అంతా బూడిదలో పోసిన పన్నీరులా నిరుపయోగమయింది, ఆయన ఒక పెద్ద మెషన్‌గన్ తీసుకవచ్చి పెదనందిపాడు ఫిర్కా మధ్యగా స్థాపించాడు. పన్నులు యివ్వకపోతే ఆ ప్రాంతం అంతా భస్మీపటలం అవుతుందనే భీతికొద్దీ ప్రజలు పన్నులు యిస్తారని ఆయన భావించాడు. ప్రభుత్వం వారి శక్తి సామర్థ్యాలను ప్రజలు గ్రహించగలరనే దృష్టితో, మిలటరీని పిలిపించి ఆ గ్రామాలలో మార్చి చేయించాడు. ఎరెస్టు, లాఠీ ఛార్జీలూ విరివిగా జరిపించి, ఆ రీతిగా ప్రజాహింస సాగించాడు.

టామీలకి మిరప పళ్ళ విందు

రాబోవు విషమ పరిణామాలను ఊహించి, ప్రభుత్వంవారు పెట్టబొయ్యే బాధలను ప్రజలు తట్టుకోలేరేమోననే భావనతో, పరిస్థితులను పరిశీలించి, రిపోర్టు చేయవలసినదిగా కోరుతూ ప్రదేశ కాంగ్రెసు కమిటీవారు ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘ సభ్యునిగా నేనూ, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, దాట్ల నారాయణరాజుగార్లతో

  1. 1940 - 41